ధరణి పోర్టల్ అంటేనే కాంగ్రెస్ నేతలు శివాలెత్తుతున్నారు. దాని పేరు వింటేనే గడగడ వణుకుతున్నారు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కర్షకులు ధైర్యంగా ఉండడం చూసి జీర్ణించుకోలేకపోతున్న రేవంత్ వంటి నేతలు వారి మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే 24 గంటల ఉచిత కరెంటు తీసేసి మూడు గంటలు మాత్రమే ఇస్తామని, ధరణి తీసేసి మళ్లీ పటేల్, పట్వారీ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. తాము వచ్చేదీ లేదు.. వాటిని తెచ్చేదీ లేదని తెలిసే వారిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలు నమ్మని రైతులు తాము సీఎం కేసీఆర్‌తోనే ఉంటామని, బీఆర్ఎస్తోనే నడుస్తామని తేల్చి చెప్తున్నారు.
– నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్
ధరణి తీసేస్తే భూరికార్డులు ఆగమైతయ్
సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతులకు భూరికార్డుల సమస్యలు తీరినయ్. ఆన్లైన్లో మా భూములు
భద్రంగా ఉన్నయ్. భూమి అమ్మకాలు, కొనుగోలు ఆఫీస్‌లో సులభంగా జరుగుతానయ్. దళారులు లేరు, మధ్యవర్తులు లేరు.
రైతులు వేలిముద్ర పెడితే తప్ప భూరికార్డులు మార్చే అవకాశం ఎవరికీ లేదు. కాంగ్రెస్ వస్తే ధరణి తీసేస్తామని అంటాళ్లు. అది తీసేస్తే రైతులకు మళ్లా మునుపటి ఇబ్బందులే వస్తయి. పాత రెవెన్యూ విధానంతో రికార్డులు తారుమారు అయ్యే ప్రమాదం ఉంటది. భూరికార్డుల సమస్యలతో గ్రామాల్లో రైతుల నడుమ గొడవలు అయితయ్. పనుల కోసం ఆఫీస్‌ల చుట్టూ తిరుగుడైతది. దళారులదే రాజ్యమయితది. ధరణితో భూ రికార్డుల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్న రైతులను ముంచేందుకు కాంగ్రెస్ కుట్రలు చేత్తాంది. సీఎం కేసీఆర్ సార్ ఉంటనే రైతులకు అన్నిరకాలుగా మేలు జరుగుతది.
-రత్న శ్రీకాంత్‌రెడ్డి, సూరారం,మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
రేవంత్‌కు పిచ్చి పట్టినట్టుంది
24 గంటల కరెంటుతోటి మంచిగా రెండు పంటలు పండించుకుంటా హాయిగా ఉన్నాం. కాంగ్రెసోళ్లు అధికారంలో ఉన్నప్పుడు పడ్డ కష్టాలు చాలు. మళ్లీ ఇప్పుడు ఎలక్షన్లు రాగానే కాంగ్రెసోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు.రేవంత్‌రెడ్డికి పిచ్చిపట్టినట్టుంది.
మూడు గంటల కరెంటు సరిపోతదని అంటున్నాడు. మూడు గంటల కరెంటు తోటి తడిసిన మడే తడుస్తుంది. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలంటడు. గీ మోటర్లు పెట్టుడంటే ఉట్టిగనే అయితదా? లక్ష రూపాయలు దాకా కావాలె. అయినా 10హెచ్‌పీ మోటరు పెడితే ఒక్క దెబ్బకు నీళ్లను గుంజేస్తాయి. మోటర్ల మీద ఒత్తిడి పడి కాలిపోతాయి. ఎవుసం గురించి ఏం తెల్వనోళ్లు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో రైతులకు తెలుసు.
– ఘనపురం సాయిలు, చందూర్, నిజామాబాద్ జిల్లా
రైతులెవరూ కాంగ్రెసోళ్లను నమ్మరు
10 హెచ్‌పీ మోటర్లు బిగించాలంటే ముందుగా ట్రాన్స్ఫార్మర్లను మార్చాలి. విద్యుత్ కెపాసిటీ పెంచాలి. రైతు ఒక మోటరు మార్చాలంటే దాదాపు లక్షా 50 వేలు ఖర్చు చేయాలి. దీంతో రైతులకు నష్టం జరుగుతుంది. లాభం మాత్రం ఉండదు.
ఇప్పుడు ఇవ్వన్నీ అయ్యే పనేనా? కాంగ్రెసోళ్లకు మతి ఉండే మాట్లాడుతున్నారా? అసలు వాళ్లకు ఎవుసం గురించి ఏమన్నా తెలుసా. ఇప్పడు ఇస్తున్న కరెంట్ వలన రైతులు 3 హెచ్‌పీ మోటర్లతో మంచిగా సాగు చేసుకుంటున్నరు. కూరగాయలకు, వివిధ పంటల సాగుకు రైతులకు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లు సరిపోతయి. 10 హెచ్‌పీ మోటర్ల వలన బావులలో నీళ్లు తొందరగా అయిపోతయి. దీంతో ఎండాకాలంలో నీళ్లుండయి. రైతులకు నష్టం తప్ప లాభం ఉండదు. అందుకే రైతులందరూ అప్రమత్తంగా ఉండాలె. కరెంట్, నీళ్లిచ్చి సాగును బంగారం చేసిన కేసీఆర్‌కు అండగా ఉండాలె. మూడోసారి సీఎంను చేసుకోవాలె. అనవసరంగా ఆగం కావద్దు.
– జెజ్జంకి అంజయ్య, గోపాల్పూర్, కరీంనగర్ రూరల్ మండలం
ధరణి తీసుడెందుకు..ఇంకేదో పెట్టుడెందుకు?
ధరణి పోర్టల్ మంచిగానే ఉంది కదా. పట్టాదారు లేకుండా ఒకరి భూమిని మరొకరికి పట్టా చేసే అవకాశం లేదు. ఎవరి భూమి వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ ఉంటే ఆన్లైన్లో భూమి వివరాలు తెలుసుకోవచ్చు.
రెవెన్యూ ఆఫీస్‌కు పోవాల్సిన అవసరం లేదు. అమ్ముకున్నా, కొనుగోలు చేసిన నిమిషాల్లో పట్టా మార్పిడి అవుతున్నది. ధరణి రాక ముందు వీఆర్వోలు, ఎమ్మార్వోల చుట్టూ తిరిగేది. రిజిస్ట్రేషన్ చేయించుకున్నంక నెలలు, ఏండ్లు గడిచినా పట్టా మార్పిడి కాకపోయేది. లంచాలు ఇచ్చినోళ్లకే పట్టా కాగితాలు వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఏ అధికారిని బతిలాడ్సిన పని లేదు. నేరుగా మీ సేవకు పోయి స్లాట్ బుక్ చేసుకొని, తహసీల్ కార్యాలయానికి పోతే రిజిస్రేషన్ అయితుంది. నిమిషాల్లో పట్టా మార్పిడి అయి పేపర్లు చేతికి వస్తున్నయ్. రైతులు సంబురంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు, రేవంత్‌రెడ్డి ఓర్వలేకపోతున్నరు. కాంగ్రెస్‌తోని అయ్యేది లేదు.. పొయ్యేది లేదు. లేనిపోనివి చెప్తూ రైతులను ఆగం చేస్తున్నరు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లే. కాంగ్రెస్ ఓటేస్తే నట్టేట మునుగుడు ఖాయం. ఉన్నదాన్ని తీసుడెందుకు.. ఇంకేదో పెడతామని చెప్పుడెందుకు?
– చిట్టవేన వినీత్ కుమార్, యువ రైతు, పెద్దకల్వల, పెద్దపల్లి జిల్లా
కాంగ్రెస్‌కు ఓటేసి మళ్లీ ఆగం కావద్దు
దేశంలో కోతలు లేకుండా రోజుకు 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం ఒక్క
తెలంగాణ మాత్రమే. కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బంది లేకుండా 24 గంటలు అందింది. 10 హెచ్‌పీ మోటర్లు అమర్చుకోవడం చాలా కష్టం. అంత డబ్బును రైతులు ఖర్చు చేయలేరు. ఒకవేళ మోటరు పెట్టినా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. పంటలు ఎండిపోవడం ఖాయం.
అందుకే ఏ ఇబ్బందీ లేకుండా కేసీఆర్ సరఫరా చేస్తున్న 24గంటల విద్యుత్ వల్ల పంటలు పండించుకుంటూ చింత లేని జీవితం గడుపుతున్నాను. గతంలో కాంగ్రెస్ హయంలో కరెంటు ఉండేది కాదు. పంటలు ఎప్పుడూ ఎండిపోవడమే జరిగేది. ఇప్పడు ప్రశాంతంగా వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము. కాంగ్రెస్‌కు ఓటు వేసి మళ్లీ రైతులు ఆగం కావద్దు.
– భూక్యా గాంధీ, రైతు, ఆసుపాక గ్రామం,అశ్వారావుపేట మండలం, భద్రాద్రి జిల్లా
రాత్రిళ్లు పొలాలకు పోవుడే లేదు
కేసీఆర్ ప్రభుత్వం ఎవుసానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నది. పొద్దున నుంచి సాయంత్ర వరకు పొలానికి నీళ్లు పెట్టుకుంటున్నం. చీకట్ల తిరిగే బాధ తప్పింది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెల్వకపోయేది. కరెంట్ కోసం రాత్రిళ్లు పొలం కాన్నే పండుకోవాల్సి వచ్చేది. అక్కడ పండుకుంటే రాత్రిళ్లు విష పురుగులు, పాములు కుట్టేవి. బావుల్లో పడిపోడి చనిపోయేటోళ్లు. కేసీఆర్ రైతుల పాలిట దేవుడు. 24 గంటల కరెంట్ ఇస్తుండు. పంటలు మంచిగా పండుతున్నాయి. సేద్యం కోసం రైతు బంధు ఇస్తుండు. సంతోషంగ ఎవుస చేసుకుంటున్నం. కాంగ్రెస్ ఇస్తానన్న మూడు గంటల కరెంట్‌కు ఎకరం పారదు. కేసీఆర్ సార్ ఇచ్చే కరెంట్ బాగుంది. రైతులు ఈ సారి కూడా కేసీఆర్‌ను గెలిపియ్యాలి.
-దేవేందర్‌రావు, రైతు, సోమిడి, కాజీపేట, హనుమకొండ
మాపక్కన కర్ణాటక రైతులు ఆగమైతున్నరు
కాంగ్రెస్‌కు ఓటేసిందుకు బాధపడుతున్నామని మా పక్కనే ఉన్న కర్ణాటక రైతులు బాధపడుతున్నారు. కర్ణాటకలో రైతులకు 10 గంటల కరెంట్ సరఫరా చేస్తామని చెప్పి 3 గంటల కూడా ఇవ్వడం లేదు. కాంగ్రెసోళ్ల్ల ఝూటా మాటలు అస్సలు నమ్మొద్దు. నమ్మి ఓట్లేస్తే రైతులు నట్టేట మునుగుడు ఖాయం. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతులను మంచిగా జూసుకుంటున్న సీఎం కేసీఆర్ వెంటే రైతులు ఉంటారు.
వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటర్ ఏమాత్రం ఉపయోగపడదు. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లను బిగించుకుంటే సరిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ పగలు ఇస్తారా? రాత్రి ఇస్తారా? చెప్పకుండా రైతులను ఆయోమంలో పడేస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్ పెడితే ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయి సన్న, చిన్నకారు రైతులకు చాలా కష్టంగా మారుతుంది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో రైతులకు తెలియని పరిస్థితి ఉండే. పంటపొలాలకు నీటి తడులు అందించేందుకు రాత్రుళ్లు సైతం మోటర్ వద్దనే నిద్రపోవాల్సి వచ్చేది. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సార్ కరెంట్ చాలా మంచిగా ఇస్తున్నారు.
-తిరుమల బక్కారెడ్డి, రైతు, హద్నూర్, సంగారెడ్డి జిల్లా
మా ఎవుసాన్నిమళ్లా ఆగం జేయద్దు
10 హెచ్‌పీ మోటర్ల వల్ల భూమిల నీళ్లు మొత్తం ఒడుస్తయి.కరెంట్ బాగా కాలుతది. రైతులకు ఫాయిదా ఉండదు. గతంలో మాటిమాటికి బోరుమోటర్లు కాలిపోతుండే. ట్రాన్స్ఫార్మర్లుకరాబు అవుతుండేటివి. ప్రతిసారి మోటరు తీయనీకి,దించనీకి మస్తు ఖర్సయ్యేది. పంటలు ఎండిపోయేటివి.
తెలంగాణ అచ్చినంకనే కరెంట్ మంచిగిస్తున్నరు. పంటల మంచిగ పండుతున్నయి. సర్కారు మా రైతులకు ఫ్రీగ కరెంట్ ఇవ్వవట్టే. గిప్పుడే అన్నివిధాలా మా రైతులకు మంచిగ ఉన్నది. మళ్లా కాంగ్రెస్ నాయకులు 3గంటల కరెంట్, పది అప్సర్ల మోటర్లని మమ్మల్ని ఆగంజేస్తరేంది. కాలం మంచిగైతున్నది. కరెంట్ మంచిగుంటున్నది. మాకు రెండు పంటలు పండుతాన్నయి. రైతులకు, కైకిలోల్లకు కైకిలి దొరుకుతున్నది. గీ కాంగ్రెసోళ్లు అస్తే మళ్లా ఎనకటి రోజుల అచ్చేటా ఉన్నయి. మళ్లా రాత్రి పారకాలకు పోవాల్సి వస్తది. కాంగ్రెసోళ్లు రావద్దు. మా ఎవుసాన్ని మళ్లా ఆగం జేయద్దు.
– ధన్‌రాజ్, రైతు, రామాయంపేట తండా, మెదక్ జిల్లా
రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్తం
ఆరుగాలం శ్రమించేవారికే ఎవుసం బాధలు తెలుస్తయి. 24 గంటల కరెంట్ ఉండడం వల్ల ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మోటర్లు పెడుతున్నాం. ఆ మధ్య సమయంలో నీటి ఊట వస్తుంది.
మూడు గంటల కరెంట్ అంటే ఎకరం పొలం కూడా పారదు. 10 హెచ్‌పీ మోటరు పెడితే ఉన్న నీళ్లను తక్కువ సమయంలోనే గుంజేస్తది. ఎకరం కాదుకదా.. 10 గుంటల పొలం కూడా తవదు. గట్లకు గండ్లుపడి వృథాగా పోతయ్. మూడు గంటల కరెంట్ అని మురికి మాటలు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి వ్యవసాయంలో పడే సాదకబాధలు తెలుసా? అధికారం ముఖ్యం కాదు.. జనం బాగు కోరాలి. నోటికొచ్చినట్లు మాట్లాడితే బుద్ధి చెబుతం. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇయ్యడం వల్లే పచ్చని పంటలు పండుతున్నయ్. కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని స్పష్టంగా అర్థమైంది. అందుకే పొరపాటున కూడా అన్నదాతలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు. రైతులకు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవు. అందుకే బీఆర్ఎస్కే మా మద్దతు.
-కల్వకోలు శ్రీనివాసరెడ్డి, కొంగరకలాన్, రంగారెడ్డి జిల్లా
భూములు బీడు పెట్టుకోవాల్సిందే
కాంగ్రెస్సోళ్లు చెబుతున్న మూడు గంటల కరెంట్‌తో ఎవుసం చేయలేం. వారి మాటలు నమ్మితే భూములు బీడు పెట్టుకోవాల్సిందే. అప్పట్ల కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడ్డాం. ఎవుసం చేయడమంటేనే భయపడేలా చేసిండ్రు. కరెంటియ్యక, నీళ్లియ్యక నరకం చూపిండ్రు.
ఎరువుల కోసం షాపుల కాడ తెల్లవార్లూ లైన్ కట్టుకొని నిలబడేవాళ్లం. పోలీసులను పెట్టి కొట్టిపిచ్చిండ్రు. అప్పుసొప్పు చేసి అష్టకష్టాలు పడి పంట పండిస్తే సక్కగ కొనేటోళ్ల కూడా ఉండకుండ్రి. ధర కూడా అంతంత మాత్రమే ఇస్తుండ్రి. ఇప్పుడేమో రైతుల బాధలన్నీ పోయినయి. 24 గంటలు ఉచితంగా కరెంటు ఇస్తున్నారు. చెరువులు, కంటలు, కాలువలు యాడ చూసినా నీళ్లే పారుతున్నాయి. బోర్లల్ల కూడా నీళ్లు బాగా ఊరుతున్నాయి. ఎరువుల కోసం లైన్ల నిలబడే కష్టమే లేదు. భూమి లెక్క ప్రకారం ఎవ్వరికెన్ని ఎకరాల్లో అన్నే బస్తాలు ఎప్పుడన్నా తీసుకోవచ్చు. పెట్టుబడి కోసం ఎవ్వరి కాళ్లు మొక్కకుండా సర్కారే రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నది. పండించిన పంట దళారుల పాలుకాకుండా కల్లాల్లోనే కాంటాలు పెట్టి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటున్నది ఇంతకంటే రైతులకు ఇంకేంకావాలి. అప్పుడు పట్టించుకోని కాంగ్రెస్సోళ్లు ఇప్పుడెట్లా పట్టించుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోను కాంగ్రెస్‌కు ఓటు వేయం.
– వెంకట్రామిరెడ్డి, జూరాల, ఆత్మకూరు, వనపర్తి జిల్లా