ఎవుసానికి మూడు గంటల కరెంటు చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ మాటలు అన్నదాతల్లో కలకలం రేపుతున్నాయి. టెన్హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలన్నఆయనగారి అజ్ఞానాన్ని తూర్పార పడుతున్నారు కరీంనగర్ రైతులు. జిల్లాలోని గోపాల్‌పూర్‌లో కలుసుకున్న అన్నదాతల అసలు ముచ్చట.. రేవంత్ కామెంట్లపై యావత్ తెలంగాణ రైతాంగం సంధించిన ఫిరంగి!
మిర్గం రాంగనె నింగి దిక్కు చూస్తడు రైతన్న. పడమటి దిక్కు వరదగుడి పడ్డది చూసి పొంగిపోతడు. ఊరించిన మేఘం ఉసూరుమనిపిస్తే.. అన్నదాత ఆగమే!
మారుతున్న కాలచక్రాన్ని అంచనా వేసి, నింగి జారిన ప్రతి చినుకునూ ఒడిసిపట్టి.. నేలతల్లికి చేరవేస్తున్న పాలకుడు రావడంతో తెలంగాణ కర్షకుల్లో హర్షాతిరేకాలు మొదలైనయ్. 24 గంటల కరెంటుతో ఆఖరి మడీ ఆనందంగా తడుస్తున్నది.
మంద తిరుపతి: ఔను వీరన్నా! ఎన్నికల్ల మంచి చేస్తమని చెప్పాలి, ఉన్నదాన్ని ఊడగొడ్తమని కాంగ్రెసోళ్లు ఫాల్తు మాటలు మాట్లాడుతున్నరేంది! కాంగ్రెస్ ఉన్నప్పుడు కరంటి కట్టాలు మనకు తెల్వనియా!! ఎవుసానికి కరంటిచ్చుడు అంటనే ఆల్లకు పట్టింపు లేకపాయె. ఏడు గంటలని దొంగరాత్రి మూడుగంటలు ఇచ్చిరి. ఇండ్ల సుత రెండు గంటలుంటె గొప్పుంటుండే! పదేండ్ల కింద ఎన్ని తిప్పలు పడ్డమో యాదికుందా! ఇప్పుడు రేవంత్‌రెడ్డి మూడు గంటలే సాలనవట్టె. పిదప కాలం కాకపోతే.. ఏం మాటలు గివ్వి!
అనుముల వీరారెడ్డి: మూడు గంటలిచ్చుడేంది తిరుపతి! గా మాట అనెతానికి కొద్దిగనన్న ఇజ్జతుండాలె. మీ జమానాల అప్పుడప్పుడిచ్చిన ఏడు గంటలే సరిపోలేదురాయ్యా! అంటే.. మూడు గంటలిత్తె సాలని ఒకటికి నాలుగుసార్లు చెప్పవట్టె. నిజంగనే ఆల్లొస్తే.. ఇస్తమన్న మూడు గంటలల్ల గిన ఆరుసార్లు కట్ చేస్తరు. గప్పట్ల కరెంట్ రాంగనె అందరు ఎగవడి ఒక్కపాలి మోటర్లు చాలు చేద్దురు. లో ఓల్టేజ్తోని మోటర్లు కాలుతుండె. వారానికోసారి ట్రాన్స్ఫార్మర్ ఎగిరిపోతుండె. ఆ ట్రాన్స్ఫార్మర్ సక్కగై అచ్చేసరికి పొలం ఎండిపోతుండె.
అనుముల ఆదిరెడ్డి : అవ్.. అంతెందుకే మన ఊల్లె మోటర్ వైండింగ్ షాపుల కరంటి మోటర్లు మండెలు వడి ఉండకపోవునా! వైండింగ్ పిల్లగాడు పొద్దుమాకుల పనిచేసినా.. మోటర్లు అస్తనే ఉంటుండె. ఇప్పడు ఆ షాపే బంద్ అయిపాయె. గంతెందుకు, రాత్రి కరంటి పెట్టవోయి సచ్చిపోయినోళ్లు ఎంతమందిని చూసినం. రాత్రయితే ఇల్లు ఇడ్సిపెట్టి పొలంలనే ఉందుం. సుట్టపోడు పోయినా.. పోకపోతిమి. రాత్రి, పగలు బాయిల చుట్టే తిరుగుతుంటిమి. ఇప్పుడు గట్లున్నదాయె. బాజాప్త పొద్దంతనే అచ్చి ఎప్పుడు గావల్నంటే గప్పుడే పొలాలకు నీళ్లు వెట్టుకోవడ్తిమి.
గోనె మల్లారెడ్డి : నువ్.. చెప్పేటిది మంచిగనే ఉన్నదిగాని మన తిరుపతి ఏమంటండు. మల్ల కాంగ్రెసత్తే ఎవుసానికి మూడు గంటల కరంటే ఇత్తరట. ఇదేమన్న సబబైన ముచ్చటేనా? గా మాట మాట్లాడెతానికి ఆల్లకు నోరెట్లచ్చిందంటవ్. ఆ పార్టీల ఎవుసం చేసేటోళ్లు ఎవలన్న ఉన్నరా లేరా..? ఇసొంటి బేకార్ మాటలు మాట్లాడ్తే మనమెట్ల ఊకుంటం.
తిరుపతి: ఈ మాటన్నది ఎవలోగాదె.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంతమే. ఎవుసానికి మూడు గంటలు సాలని అన్నప్పుడు నా పెయ్యంత మండింది. ఏదో మాటజారిండు అనుకుంటె.. టెన్నెచ్చిపీ మోటర్లు పెట్టుకుంటే గంటకు ఎకరం పారతదని సెప్తున్నడు. మూడెచ్పీ మోటర్ కొననీకే 30 వేలైతన్నయ్. టెన్నెచ్పీ ఏడికి వోయి తేవాలి. ఇంకోటెరికేనా.. టెన్నెచ్పీ మోటరు నీళ్లు ఎంత రువ్వడి మీదుంటయి. గా నీళ్లు కాలువల్ల పారిచ్చి పునాస పంటలు పండిచ్చుడు అయితదా..? కాలువలు ఏడికాడికి తెగిపోవా..? ఇసొంటి తెలివి తక్కువ ముచ్చట్లు రేవంతం ఎందుకు మాట్లాడుతండో ఏందో..
దాడి లక్ష్మయ్య: గీ మాటన్నోనికి ఏమన్న తల్కాయ గిట్ల ఖరాబైందటరా.. (అందరి నవ్వులు) లేకపోతే ఏందే! ఎవుసం మంచిగుండాల్ననే కేసీఆర్ సార్ 24 గంటల కరంటియ్యవట్టె. ఇప్పుడు గాడెవడో అచ్చి మూడు గంటలు మస్తయితదంటే మనం ఇనుకుంట కూసుంటమా.. ఏం చెయ్యాల్నో గది బరాబర్ చెయ్యాలె..
తిరుపతి: లచ్చన్న బరాబర్ చెప్పిండు. గిన్ని ఇగురాలు చేసి కేసీఆర్ సార్ మనకు మంచి చేత్తంటే.. ఆల్లకు కండ్లు మండుతన్నయి. పదేండ్ల కింద మన బతుకులు ఎట్లుండె? ఇప్పుడెట్లున్నయ్. ఒకసారి యాదికి తెచ్చుకోండ్రి. కరెంటుంటే నీళ్లు లేకపాయె. నీళ్లుంటే కరెంటు లేకపాయె. ఇప్పుడు కాళేశ్వరం కట్టి నీళ్లియ్యవట్టె. ఒకప్పుడు బాయిల నీళ్లు పాతాళంల ఉంటుండె. ఇప్పుడు ఎంత మీదికొచ్చినయ్. తోడినన్ని నీళ్లు ఊరుతున్నయ్. మీదికెళ్లి రైతుబంధు ఇయ్యవట్టె. అదృష్టం మంచిగ లేక కాలంజేత్తే రైతుబీమా కింద ఐదు లక్షలిచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవట్టె.. గివన్ని కాంగ్రెసోళ్లతోని అయితదానె!
అనుముల రాజిరెడ్డి: గాళ్లతోని ఏమైతది. పక్కరాష్ట్రం కర్ణాటక ముచ్చట ఎట్లయిందో చూస్తనే ఉన్నం కదా! ఆడికెంచి అచ్చిన కాంగ్రెసోల్లు ‘మాతాన ఐదు గంటలు కరంటిస్తున్నం’ అని చెప్పవట్టె. ఈడ 24 గంటల కరంటి ఉంటే.. నువ్వొచ్చి ఐదు గంటల ముచ్చట రొమ్మిరిచి చెప్పుడేందో ఏమో! గీ మాయ మాటలు ఇని మోసపోనికి మనం ఎడ్డోల్లం అనుకుండ్రేమో! తెలంగాణ అచ్చినంక మన విలువ పెరిగింది. కేసీఆర్ సార్ చెయ్యవట్టి ఇంత మొఖం తెల్లగైతంది. ఇప్పుడు మల్లొచ్చి మనల్ని కిందికి గుంజుతమంటె ఊరుకుందామా?
ఏరువ రవీందర్‌రెడ్డి: ఈల్ల కోతలిని.. ఓటేత్తిమంటే కరంటి కోతలు తప్పయ్. ఎన్కట సబ్టేషన్ కాడ ఎన్ని ధర్నాలు చేసినమో యాదికుంది కదా! తెలంగాణ అచ్చినంక మనం ఏనాడైనా సబ్టేషన్ తానికి పోయినమా? గీ ఫాల్తు మాటలు నమ్మనీకి ఇప్పుడు రైతులు ఎన్కటి లెక్క ఎడ్డోళ్లు కాదు. ఎవలు ఏందో, ఎవరి పాలన ఎట్లుందో తెలుసుకొని తెలివికొచ్చిండ్రు.
తిరుపతి: మనం సుతం ఆలోచించుకోవాలె.. అధికారంలకు రాకముందే ఎవుసానికి మూడు గంటల కరంటి సాల్తదని చెప్తే.. పుసుక్కున అధికారంలకు అస్తే.. బరాబరి చేసి తీర్తరు. మీదికెళ్లి మేం అప్పుడే చెప్పినమని బుకాయిస్తరు. ఇసొంటోళ్లకు ఓటెత్తమా ఏంది. ఇన్ని రోజులు మనల కంటికి రెప్పలెక్క కాపాడుకున్న కేసీఆర్‌ను మర్సిపోతమా. ఇన్ని సౌలతులు పొందుకుంట రైతనెటోడు కాంగ్రెస్‌కు ఓటేత్తాడె. రైతులంటెనే కేసీఆర్.. కేసీఆర్ అంటెనే రైతులు.
లక్ష్మయ్య: నేను పుట్టిన కాన్నుంచి గిట్వంటి సర్కారును కండ్ల జూడలే! ఎవ్వడు ఏమన్న అనుకోనియ్యిండ్రి. మన ఓట్లయితే కేసీఆర్ సార్కే.. మల్ల అయ్యిదేండ్లదాక నేను బతికుంటే అప్పుడు సుత నా ఓటు కేసీఆర్‌కే. తెలంగాణ రాక ముందు రైతును ఎవ్వడన్న ఎట్లున్నవని అడిగినోడు ఉన్నడా?
తిరుపతి : గిదైతే నిజం.. అప్పుడు పదెకరాల ఆసామి సుతం రొండెకరాలు దున్నెతానికి ఆలోసిస్తుండె. నీళ్లు లేక, కరంటి రాక పెట్టువడి పోతదా అని భయపడుతుండె. ఇపుడు మస్తు నీళ్లుండె.. 24 గంటలు కరంటి ఉంది. అప్పుడు ఎంత పంట వండింది.. ఇప్పడు ఎంత వండుతాంది. పదెకరాలు ఉన్నోడు ట్రాక్టర్ వడ్లు వండితే సంబురపడేది. ఇప్పుడు వడ్లు గుంజుడికి ట్రాక్టర్లు సరిపోతున్నయా? కరంటి లేకుంటే గిట్ల పండిచ్చెటోళ్లమేనా! టెన్నెచ్చిపీ మోటర్లు వెట్టుకొమ్మనే కాంగ్రెస్‌కు ఓటెద్దమా? 24 గంటల కరంటిచ్చే కేసీఆర్‌కు ఓటేద్దమా..?
లక్ష్మయ్య: చెప్పనే వడ్తి.. నేను మల్లొచ్చే ఐదేండ్లకు సుతం కేసీఆర్‌కే ఓటేత్త.. ఎవడు ఏం చేసుకుంటడో చేసుకోనియ్!!
…? డి.వెంకటస్వామి
ఎ.బాలు