హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జనగణన(సెన్సెస్) విధులకు వెళ్తున్న ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, క్షేత్రస్థాయిలో పెండింగ్ సమస్యలపై గ్రామీణ ప్రాంతాల ప్రజ లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తి కాస్తా.. జనాభా వివరాల సేకరణ కోసం వస్తున్న ఉపాధ్యాయులపై శాపనార్థాలు, నిలదీతలుగా మారుతున్నాయి. ‘మా బాధలు పట్టించుకోని ప్రభుత్వానికి వివరాలు ఎందుకు?’ అంటూ ఎకడికకడ నిలదీస్తుండటంతో ఎన్యుమరేటర్లు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురవుతున్నారు.
సెన్సెస్ సిబ్బంది గ్రామాల్లోకి అడుగుపెట్టడమే ఆలస్యం.. మహిళలు, రైతులు, వృద్ధులు గుంపులుగా చేరి వారిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా రైతాంగ సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీనతపై భగ్గుమంటున్నారు. ‘నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నాం. వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయి. అయినా, మా దికు చూసే నాథుడే లేడు, మా బాధలు పట్టించుకునే అధికారే రాడు. మీకు మాత్రం మా జనాభా లెకల వివరాలు కావాలా?’ అంటూ నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు క్షేత్రస్థాయిలో అమలుకాకపోవడంపై ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే..
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన ప్రజలు.. ‘కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేదని గుర్తుచేసుకుంటున్నరు. మాకు రైతుబంధు సకాలంలో వచ్చేది. విత్తనాలు సరిగ్గా దొరికేవి. వడ్ల కొనుగోళ్లు చకచకా సాగేవి’ అని గ్రామీణులు బహిరంగంగానే చెప్తున్నారు. ఉన్న పథకాలు ఊడబీకుతున్నారని నిట్టూర్చుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఎదురవుతుండటంతో ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తప్పు ప్రభుత్వానిదై తే.. క్షేత్రస్థాయిలో ప్రజల ఆగ్రహానికి బలికావాల్సి వస్తున్నదని వాపోతున్నారు.