నారాయణరావుపేట, డిసెంబర్ 18: ఉన్నది ఎకరంన్నర భూమి.. ఆ భూమిలోనే అన్ని రకాల పంటలు వేశాడు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లికి రైతు మ్యాకల రామచంద్రం. క్యాబేజీ, క్యారెట్, వంకాయ, బెండకాయ, మిరప తదితర ఆరుతడి పంటలు పండిస్తూ లాభాలు పొందుతున్నాడు. పంట కాలంలో మూడు రోజులకోసారి నీరు పెడితే సరిపోతుందని, 45 రోజుల నుంచి 90 రోజుల్లోనే కూరగాయలు కోతకు వస్తాయని చెప్తున్నాడు. రెండేండ్లుగా ఈ విధంగానే సాగు చేసి లాభాలు పొందుతున్నానని అంటున్నాడు. మూడు నెలల్లోనే పెట్టుబడులు పోగా, లక్షా 20 వేలు ఆర్జించినట్టు చెప్పాడు. వరి దిగుబడికి చాలా రోజులు పడుతుందని, కూరగాయలు పెడితే, ఎప్పటికప్పుడు చేతికి డబ్బులు రావటంతో పాటు, ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు వీలవుతుందని చెప్తున్నాడు.
ఆర్థిక ఇబ్బంది ఉండదు
వరి దిగుబడికి చాలా రోజులు పడుతుంది. అదే కూరగాయలు సాగు చేస్తే త్వరగా పంట చేతికొస్తుంది. చేతికి డబ్బులు త్వరగా అందుతాయి. ఎకరంన్నర భూమిలో నాలుగైదు రకాల కూరగాయల పంటలు సాగు చేస్తున్నా. ఓ పంటకు డిమాండ్ లేకున్నా మరో పంటకు మంచి డిమాండ్ ఉండి లాభం వస్తున్నది. ఎప్పుడూ నష్టం రాలేదు.