హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సాగు నీటికి కటకట.. తాగునీటికి తండ్లాట.. కరెంటు కోతలు.. బొగ్గు కొరతతో రాష్ట్రం సతమతమవుతున్నది. ఇదంతా ఎల్ నినో ఎఫెక్ట్ అంటూ రేవంత్‌రెడ్డి సరార్ చేతులెత్తేసింది. మరోవైపు బీరు ఏరులై పారాలని హుకుం జారీ చేసింది. ‘కరువు గిరువు జాన్తా నై.. 24 గంటలు బీరు కంపెనీలు నడువాల్సిందే’ అని ఆదేశించింది. ఎల్ నినో ఎండలతో బీరుకు డిమాండ్ ఉన్నది.. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి చేయాలని కంపెనీలకు సూచించింది. బ్రూవరీలకు నీటి సరఫరా ఆగొద్దని బీరు కంపెనీలు ఉన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
సింగూరు నీళ్లు అందకపోతే పక్కన ఉన్న చెరువులు, బోర్లు, ప్రైవేట్ ఎజెన్సీలు, హైదరాబాద్ ఇండస్ట్రియల్ జలాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెచ్చుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో పొలాలు బీడు వారినా పరవాలేదు గానీ, బీరు తయారీకి మాత్రం నీరు ఆగొద్దన్న ప్రభుత్వ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదినెలలైనా 1,800 గ్రామాల ప్రజలు, మహానగరవాసుల గురించి పట్టించుకునే తీరిక లేని సరార్, బీరు కంపెనీలకు మాత్రం ఏడాదికి సరిపడా నీటిని ఎలా ఇవ్వాలనే విషయమై తీవ్ర కసరత్తు చేయడంపై పరిశీలకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు టీ జగ్గారెడ్డి బుధవారం హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులతో మంజీరా పరీవాహక గ్రామాల తాగునీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తాగునీటి అవసరాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత ఏ స్థాయికి చేరిందనే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. వచ్చే డిసెంబర్ నెల వరకే తాగునీరు అందించగలమని, ఆ తర్వాత గ్రామాల గొంతు తడపడం తమ వల్ల కాదని అధికారులు నిర్మొహమాటంగా చేతులెత్తేశారు.
సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంత గ్రామాలకే ప్రస్తుతం రెండు మూడు రోజులకు ఒకసారి అరకొరగా నీళ్లు అందుతుండగా, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దుర్భరంగా మారుతుందని అధికారులు కుండబద్దలు కొట్టారు. దీంతో ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ గ్రామాల్లో సర్పంచులే బాధ్యత తీసుకొని డప్పు చాటింపు వేయించాలని జగ్గారెడ్డి స్వయంగా ఆదేశాలు జారీచేశారు. తీవ్ర కరువు ముంచుకొస్తున్న వేళ ప్రజలకు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్లు చేయాల్సిన అధికార యంత్రాంగం, చివరికి ఇలా డప్పు చాటింపులకు పరిమితం కావడం కాంగ్రెస్ సరార్ నిర్లక్ష్యానికి, ప్రజారోగ్యం పట్ల చూపిస్తున్న ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనంగా మారింది.
రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం వద్ద ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేనట్టు తెలుస్తున్నది. నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలకు మాత్రమే పరిమితం కావాలని ప్రభుత్వం రైతులను హెచ్చరిస్తున్నది. ఇప్పటికే సింగూరు, జూరాల భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ తదితర పరీవాహక ప్రాంతాల కింద క్రాప్ హాలిడే ప్రకటించింది. దీంతో 30 లక్షల ఎకరాల సాగు సందిగ్ధంలో పడ్డది. ఎల్ నినో ప్రభావంతో నీటి ఎద్దడి నెలకొన్నదని, కేంద్రం నుంచి రూ.20 వేల కోట్ల సాయం కోరామని ఇటీవల ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ప్రాజెక్టుల్లో ఉన్న జలాలను తాగునీటి అవసరాల కోసం పొదుపుగా వాడుకోవాల్సి వస్తున్నదని చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో బీరు ఉత్పత్తి, సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఎక్సైజ్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. సాధారణంగా ప్రతి బ్రూవరీ రోజుకు 8 గంటల (సింగిల్ షిఫ్ట్) చొప్పున మాత్రమే నడిచేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. కానీ ఎల్ నినో డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు, ఐదు ప్రధాన బ్రూవరీలను 24 గంటలూ (మూడు షిఫ్టులు) నడుపుకొనేలా ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ప్రతి అదనపు 8 గంటల షిఫ్టుకు ఒకోరోజు లెకన అదనపు ఎక్సైజ్ ఫీజు వసూలు చేస్తూ ఖజానా నింపుకొనే పనిలో పడ్డది.
సంగారెడ్డి జిల్లాలో 1,800 గ్రామాలు సహా హైదరాబాద్ నగర తాగునీటికి సింగూరు ప్రాజెక్టే ప్రధాన ఆధారం. భాగ్యనగరానికి రోజుకు 120 మిలియన్ గ్యాలన్ల నీళ్లు సింగూరు నుంచి వస్తాయి. రాష్ట్రంలో ఉన్న ఆరు బీరు కంపెనీలకూ ఇదే ప్రధాన జలవనరు. రోజుకు 2.64 కోట్ల లీటర్ల నీళ్లు ఈ కంపెనీలకు సరఫరా అవుతాయి. ఈ ఆరు బ్రూవరీస్ రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం 6.98 లక్షల కేసులు (కేసు = 12 సీసాలు). సగటున ఏడాదికి 7.5 కోట్ల కేసుల బీరు ఉత్పత్తి అవుతుందని అంచనా. ఒక బ్రూవరీలో రోజుకు 1,000 కిలోలీటర్ల ప్యూరిఫైడ్ నీరు వినియోగిస్తారు.
(కిలోలీటర్ = 1,000 లీటర్లు) ఒక లీటర్ స్వచ్ఛమైన జలం పొందాలంటే నాలుగు లీటర్ల నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుందని బ్రూవరీస్ ఉద్యోగులు చెప్తున్నారు. ఈ లెకన ప్రతి కంపెనీ సగటున 44 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నది. ఇతర బయోలాజికల్ అవసరాలు, మొకలకు నీళ్లు తదితర అంశాలను కూడా కలుపుకొంటే 45 లక్షల లీటర్ల నీళ్లు అవసరమని అంచనా వేస్తున్నారు. ఆరు కంపెనీలకు కలిసి రోజుకు 2.74 కోట్ల లీటర్ల నీళ్లు సింగూరు నుంచే అందుతున్నాయి.
జనవరిలోనే సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో నీటి వినియోగం ఎలా అనే అంశం మీద చర్చ జరిగింది. డ్యామ్ మరమ్మతుల కోసం నీటిని తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. సింగూరు ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ సాగునీటి కోసం ఆందోళన చెందారు. ప్రభుత్వం రైతుల కోసం ఈ రోజు వరకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. కానీ బ్రూవరీలకు కోసం ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సింగూరు నీటిని బ్రూవరీలకు అందించడం పాత విధానమేనని వ్యాఖ్యానించారు. బీరు కంపెనీలకు నీటి వనరు ఒక సింగూరు, మంజీరాతోనే పరిమితం కాకుండా.. ఎక్కడ నీరు దొరికతే అకడి నుంచి నీటిని తీసుకునే వెసులుబాటు కల్పించారు.