మాటలతో మాయచేసి అన్నదాతల ఆగ్రహాన్ని చల్లార్చడానికి మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. బ్యాంకర్ల తప్పిదం, సాంకేతిక కారణాల వల్లే రుణమాఫీ జరగలేదంటూ మంత్రులు నెపాన్ని బ్యాంకుల మీదికి తోసివేసే ప్రయత్నం చేయడంతో రైతన్నలు బుధవారం బ్యాంకుల మీదకు దండెత్తారు. మాకెందుకు మాఫీ కాలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకర్లను నిలదీశారు. దీంతో అనేక చోట్ల బ్యాంకులకు తాళాలు వేయడం లేదా పోలీసు భద్రతలో నడిపించడం కనిపించింది. మాఫీ మోసంపై నేడు బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చింది. దీంతో ప్రభుత్వం పోలీసుల ద్వారా కార్యక్రమాన్ని అడ్డుకునే పనిలో పడింది. బీఆర్ఎస్ ధర్నాలకు ప్రభుత్వ అనుమతి లేదని వాటికి వెళ్లొద్దంటూ, వెళ్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ తదితర అనేక జిల్లాల పోలీసులు రైతులకు నోటీసులు జారీ చేశారు..
BRS | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కార్ మెడలు వంచి ఎటువంటి ఆంక్షల్లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనున్నది. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ సర్కార్‌లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల కేడర్‌ను సమాయత్తపరిచి కార్యక్రమ విజయానికి కావలసిన ఏర్పాట్లు చేసింది.
ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కేటీఆర్ బుధవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రూ. 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని చెబుతున్న వైనాన్ని రైతాంగానికి తెలిపేలా కార్యాచరణను పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికలు కాగానే రుణమాఫీకి రూ.40 వేల కోట్ల అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొని, మంత్రివర్గ సమావేశం రూ.31 వేల కోట్లకే అనుమతిచ్చారు. రుణమాఫీకి బడ్జెట్లో రూ.26వేల కోట్లకు ఆమోదం తెలిపి, కేవలం రూ.18వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని ప్రతీ రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
క్షేత్రస్థాయిలో కనీసం 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధిచేకూరలేదని సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వ వైఖరిపై రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తారని భావిస్తున్నారు.
న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: రూ.2లక్షల రుణమాఫీ అమలు అస్తవ్యస్తంగా మారింది. సగం మందికి మాఫీ అయ్యి, మరో సగం మందికి కాకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణ మాఫీ కోసం వ్యవసాయ అధికారులు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులకు వెళ్తే అధికారులను కలువమని, అధికారులను కలిస్తే బ్యాంకులకు వెళ్లమని చెప్తున్నారని రైతులు వాపోతున్నారు. బ్యాంకర్ల తప్పిదాల వల్లే కొందరికి మాఫీ కాలేదంటూ మంత్రులు పదేపదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బ్యాంకులకు క్యూకట్టారు. తమ రుణమాఫీ ఎందుకు కావట్లేదని సిబ్బందిని నిలదీశారు. పలు చోట్ల ధర్నాలు చేశారు. విధులను అడ్డుకున్నారు. తమకు ఆధార్‌కార్డ్, రేషన్ కార్డు, పట్టా పాస్‌బుక్ ఉన్నప్పటికీ రుణం మాఫీ కాకపోవడమేంటని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ఏఈవో ఆఫీసులో తొలి, మలి విడుతల్లో రుణమాఫీ కాని రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని చూసి రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.-
నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో రుణమాఫీ కాని రైతుల నుంచి తొలి, మలి విడతలో స్వీరించిన దరఖాస్తులను కార్యాలయంలో ఇలా విసిరిపారేశారు. దీంతో తమ దరఖాస్తును వెతుక్కుంటున్న రైతులు. (ఇన్సెట్లో) దరఖాస్తులు స్వీకరిస్తున్న నోడల్ అధికారి
జనగామ జిల్లా చిలుపూరు మండల కేంద్రంలోని మల్కాపూర్ ఇండియన్ బ్యాంకులో రుణమాఫీ ఎందుకు కాలేదో చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నేరడిగొండ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రేవంత్ షరతుల్లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట బ్యాంకు వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. తమ రుణమాఫీ చేయాలని అధికారులను నిలదీశారు.
నారాయణపేట జిల్లా ధన్వాడ రైతు వేదికలో ఏఈఓ సైమన్ను రుణమాఫీ చేయాలని రైతులు నిలదీశారు. తమకు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు చేయడం లేదని అక్కడే ఉన్న వ్యవసాయ శాఖాధికారులను నిలదీశారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ బ్యాంకుకు రైతులు తరలివచ్చారు. బ్యాంకు వద్ద అధికారుల కోసం వేచి చూశారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో జాతీయ రహదారిపై బైఠాయించిన అన్నదాతలను ఈడ్చిపాడేస్తున్న పోలీసులు
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో రెండోరోజూ బ్యాంకును మూసివేసి రైతులు నిరసన తెలిపారు. బ్యాంకు సిబ్బంది రైతుల పేర్లు రుణమాఫీకి పంపడంలో నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారుల విధులను అడ్డుకున్నారు.
నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్బీఐ వద్ద టోకెన్ల కోసం తోపులాడుకుంటున్న రైతులు. టోకెన్ల కోసం ఉదయం 9గంటలకే వచ్చి రైతులు బారులుదీరారు. తమకు అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదని, బ్యాంక్ అధికారులను అడిగినా సమాధానం చెప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
జగిత్యాల జిల్లా పూడూర్లో జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో రుణమాఫీ కాని రైతుల నుంచి నోడల్ అధికారి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఈఓ కార్యాలయంలో చిందరవందరగా పడేసిన దరఖాస్తులను చూసి రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పేరాయగూడెంలో రుణమాఫీ చేయాలని స్వచ్ఛందంగా దీక్ష చేస్తున్న రైతులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం ఏపీజీవీబీ ఎదుట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అర్హులైన రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ రైతు పేరు కొల్లూరి శ్రీను. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం గ్రామం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లిస్తే మాఫీ అవుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్ చెప్పడంతో పైనున్న రూ. 48 వేలను బ్యాంకులో చెల్లించాడు. ఆ తర్వాత మేనేజర్‌ను అడిగితే ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని చెప్పడంతో విస్తుపోయాడు. వ్యవసాయశాఖ అధికారిని అడిగితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని
ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈమె పేరు కల్వాల ఎల్లమ్మ. ములుగు జిల్లా జాకారం గ్రామం. బండారుపల్లి రోడ్డులో బుధవారం జరిగిన దివ్యాంగుల ఉపకరణాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ఎల్లమ్మ హాజరైంది. అక్కడ కలెక్టర్‌ను కలిసి తనకు రుణమాఫీ కాలేదని, తన కొడుకు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. ముసలోడు చనిపోయా డని, ఇప్పుడు మీద పైసలు కట్టుమంటే ఎట్ల కట్టేది బాంచన్ అని కన్నీరు పెట్టుకున్నది.
ఈ రైతు పేరు ఆశయ్యగౌడ్. సీఎం రేవంత్నియోజకవర్గమైన కొడంగల్‌లోని అప్పాయిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు. రేషన్‌కార్డు ప్రకారం ఆయన పేరుపై రూ. లక్ష, తల్లి పేరుపై రూ. 90 వేలు రుణం ఉంది. రేషన్‌కార్డు ప్రకారం చూసినా ఆశయ్యది, ఆయన తల్లిది కలిపి రుణం మాఫీ కావాలి. కానీ కాలేదు. ప్రభుత్వం ముందు 2లక్షల అప్పు మాఫీ చేస్తే పైనున్న అప్పును రైతులు చెల్లించుకుంటారని, మిగతా అప్పును ముందు చెల్లించమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షలు మాఫీ చేయాలని వేడుకుంటున్నాడు.
అర్హులైన రైతులకు రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించిన రైతులు డుబ్బుల చంద్రశేఖర్, అలిగే గణేశ్, తురాటి భోజన్న, చెట్ల వినీల్పై పోలీసులు కేసు పెట్టారు. 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘించారంటూ అభియోగాలు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్లో భాగంగా బుధవారం వీరు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాఫీ చేయాలన్న రైతులపై ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, కాంగ్రెస్‌కు రైతుల ఉసురు తగులుతుందని పేర్కొనారు.