గజ్వేల్, ఆగస్టు 16: రైతులపై రేవంత్సర్కారుకు చిత్తశుద్ధిలేదని, వారు అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారిపై యూరియా కోసం శనివారం చేపట్టిన ధర్నాలో పాల్గొని రైతులనుద్దేశించి మాట్లాడారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఏర్పాటు చేసిన రేక్ పాయింట్‌ను ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన నియోజకవర్గానికి యూరియాను తీసుకెళ్లి ఇతర నియోజకవర్గాల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో లేని యూరియా కొరత గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాకలో ఎందుకు వస్తున్నదని ప్రశ్నించారు.
వారం రోజుల్లో గజ్వేల్ ప్రాంత రైతులకు యూరియా పంపిణీ చేయని పక్షంలో రాజీవ్ రహదారిని వంటవార్పుతో దిగ్బంధిస్తామని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి కెనాల్ల ద్వారా సాగునీళ్లు 24గంటల పాటు ఇవ్వకపోతే ప్రభుత్వానికి తడాఖా చూపిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రైతులు బంగారు పంటలు పండించారని, ప్రస్తుత ప్రభుత్వం విచారణల పేరిట డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపిందని పేర్కొన్నారు. కేసీఆర్ పేరును తుడిచివేయాలని కాంగ్రెస్ చేస్తున్న రాజకీయాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. రైతులు తరఫున పోరాటం చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని మండిపడ్డారు.
వారంరోజుల నుంచి తిరిగితే కూడా మాకు ఒక్క బస్తా దొరకలేదు. రైతులను పట్టించుకోకపోతే ఎట్లా? గంటలకు గంటలు లైన్లో నిలబడుతున్నాం. గిట్లయితే రైతు బతుకుడెట్లా? కేసీఆర్ టైమ్‌లో ఊర్లోకి యూరియా లోడ్ వస్తుండే. రైతులకు సరిపడా సంచులు ఇస్తుండే. ఇప్పుడేమైంది.. ఎందుకిస్తలేరు? ఇదేం రాజకీయం? ఇదేం ప్రభుత్వం?
– ఎన్నెల్లి బాలలక్ష్మి, రైతు, రిమ్మనగూడ