గోపాల్పేట, సెప్టెంబర్ 27 : రుణమాఫీతోపాటు రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు ధర్నా చేపట్టారు. శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, యూనియన్ బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రఘురామారావు, సేనాపతి, భీమన్నతోపాటు పలువురు నాయకులు, రైతులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వాటిని అమలు చేయలేక మీనమేషాలు లెక్కిస్తున్నదని ధ్వజమెత్తారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ సర్కారు అర్హులైన రైతులకు మాఫీతోపాటు రైతుభరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.