మోర్తాడ్, డిసెంబర్ 15 : ఇటీవల కొనుగోలు చేసిన సన్నవడ్లకు (Fine Rice) సంబంధించిన బోనస్ (Bonus) డబ్బులను ఎప్పుడిస్తరని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో రైతులు సంత నడ్పిరాజేశ్వర్, కొమ్ముల రాజన్న, బద్దం రాజశేఖర్, చిన్నయ్య, కొత్తపల్లి రఘు, సంతోష్, ముత్యంరెడ్డి, కొమ్ముల పెద్దబాలయ్య, బామని రాజేశ్వర్, జడల చిన్నరాజన్న, కోనయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో దిగుబడి తక్కువ వస్తుందని తెలిపీ సన్నరకం వడ్లు పండించినట్టు తెలిపారు.
తమను ఇబ్బందులు పెట్టకుండా వెంటనే బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోర్తాడ్ మండలం గాండ్లపేట్ వద్ద వరద కాలువకు గండి పడి నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటలకు నీటివిడుదల చేయనున్న నేపథ్యంలో వరదకాలువ గండికి మరమ్మతులు చేయాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
మూసాపేట(అడ్డాకుల), డిసెంబర్ 15 : మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో అబ్బాయి.. బాబాయ్ మధ్య రసవత్తర పోటీనెలకొన్నది. బీఆర్ఎస్ తరఫున ఆకులమోని రవి (బాబాయ్), కాంగ్రెస్ నుంచి ఆకులమోని చెన్నకేశవులు (అబ్బాయి) తలపడుతున్నారు. ఇద్దరి మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారం సాగుతున్నది.
మొదట రవిని సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులు నిర్ణయించారు. ఇతడినే ఏకగ్రీవం చేసుకోవాలని భావించారు. కాంగ్రెస్ నాయకులు సైతం ఏకగ్రీవం చేస్తామని చెప్తూనే తమ పార్టీ కండువా కప్పుకోవాలని ఒత్తిడి పెంచారు. అందుకు ఆయన ససేమిరా అనడంతో కాంగ్రెస్ తరఫున ఆకులమోని చెన్నకేశవులును బరిలో నిలిపారు. ఈ ఎన్నికలో బాబాయ్ లేదా అబ్బాయి ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొన్నది.