పెద్దఅడిశర్లపల్లి, జూలై 31: కాలువల ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గుడిపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌ను అడ్డుకున్నారు. గురువారం రైతులు గుడిపల్లి గ్రామ సెంటర్లో ధర్నాకు దిగారు. అదే సమయంలో ఎమ్మెల్యే పక్క గ్రామంలో రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకొని గుడిపల్లి మీదుగా వెళ్తున్న క్రమంలో రైతులు ఆయన వాహనాన్ని అడ్డగించారు.
ఏఎంఆర్పీ (7బీ కెనాల్) కాలువల ద్వారా నీటిని విడుదల చేసి అదుకోవాలని వారు డిమాండ్ చేశారు. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని, ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణమే కాలువలు నింపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే తన వాహనంలో నుంచి దిగి వచ్చి ఏఎంఆర్పీ ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలను నింపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇదే విషయమై ఇరిగేషన్ అధికారులకు సూచించినట్టు చెప్పారు. ఎమ్మెల్యే హామీతో రైతులు ఆందోళన విరమించారు.