Farmers Protest | జగిత్యాల రూరల్/ రాయికల్, మే 23 : కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట ఐకేసీ సెంటర్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు మొలకెత్తిన ధాన్యంతో ధర్మపురి జగిత్యాల ప్రధాన రహదారిపై నిర్వహించారు. అర్బన్ తహసీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ సదాకర్ చేరుకొని రైతులకు సర్ది చెప్పినా ససేమిరా అనడంతో అదనపు కలెక్టర్ బీఎస్ లత ధర్నా వద్దకు చేరుకున్నారు. ధాన్యం ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.
తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రాయికల్ మండలం సింగారావుపేట- శ్రీరామ్‌నగర్ గ్రామాల రైతులు సింగర్రావుపేట- జగిత్యాల రహదారిపై బైఠాయించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. తహసీల్దార్ గణేశ్ చేరుకొని రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు కొనుగోళ్లు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అకాల వర్షాలకు తడిసిన ధా న్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు.
ఆర్మూర్‌టౌన్: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని గోవింద్‌పేట్ చౌరస్తా వద్ద ధాన్యం సంచులతో శుక్రవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన పంట తడిసిపోయి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్డీవో రాజాగౌడ్ అక్కడికి చేరుకుని సమస్యలను త్వరలో పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు శాంతించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా ఆర్మూర్ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్ సిబ్బందితో వచ్చి క్లియర్ చేశారు.
కౌటాల: తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట, సిర్పూర్(టీ) పారిగాం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. ముత్తంపేటలోని కౌటాల-సిర్పూర్ ప్రధాన రహదారిపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా చేయడంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అక్కడికి చేరుకుని రైతులకు మద్దతుగా రాస్తారోకోలో కూర్చున్నారు. రైతు కష్టాల గురించి కలెక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అదనపు కలెక్టర్ డేవిడ్ పారిగాం, ముత్తంపేట వరి కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకుని తడిసిన వడ్లను పరిశీలించారు. వారంలోగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, ఇతర పార్టీల నాయకులు రైతులకు మద్దతు పలికారు.
ఖానాపూర్ రూరల్: తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్లోని గోసం వాడ వద్ద మెట్‌పెల్లి ప్రధాన రహదారిపై సుర్జా పూర్, బాదనకుర్తి, మేడంపెల్లి గ్రామాల రైతు లు ధర్నా చేపట్టారు. గంట వరకు ధర్నా కొన సాగగా తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల దగ్గర తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. యాసంగి సీజన్లో 56 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ప్రభుత్వ అధికారులు అంచనా వేశారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ప్రధాన కార్యదర్శి సాగర్ తెలిపారు. కానీ అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. నెల కిందనే కోతలు పూర్తి చేసుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకొచ్చినా అధికారులు 15 రోజుల వరకు తూకాలు పూర్తి చేయలేదని మండిపడ్డారు.
ధాన్యం కొనుగోలు పూర్తయినా సకాలంలో లారీలు రాలేదని, అందుకే ధాన్యాన్ని మిల్లులకు పంపలేదని ప్రభుత్వ పెద్దలు, అధికారులు సాకులు చెప్తున్నారని రైతు సంఘం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, సాగర్ మండిపడ్డారు. బాధ్యులైన కాంట్రాక్టర్ల మీద ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. మరోవైపు కొనుగోలు కేంద్రాలలో 40 కేజీల బస్తాకు 2 కేజీల చొప్పున తరుగు తీస్తున్నారని, నిబంధనల ప్రకారం 700 గ్రాములు మాత్రమే తరుగు తీయాలని చెప్పారు. మిల్లుకెళ్లిన తర్వాత మరోసారి తరుగు తీయడమేంటని ప్రశ్నించారు. రైతులు రెండు రకాలుగా నష్టపోతున్నారని చెప్పారు.