ఘట్కేసర్, సెప్టెంబర్ 19: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన రుణమాఫీ హామీ కొర్రీలపై అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీంతో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా యి. ప్రభుత్వ వైఖరిపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. రైతు రుణమాఫీ వర్తింపచేయాలంటూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ ఉమ్మడి మండల రైతులు భిక్షాటన చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు.
ఘట్కేసర్లోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద ‘రైతు రుణమాఫీ సాధన సమితి’ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుల రిలే నిరహార దీక్ష 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న రైతులకు బీఆర్ఎస్ ఘట్కేసర్ పట్ట ణ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, పట్టణ జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్‌రెడ్డి, మండల రైతు సేవా సహకార సంఘం మాజీ చైర్మన్ బిక్షపతిగౌడ్, డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి సంఘీభావం తెలిపి భిక్షాటన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు దీక్షతో స్పందించకపోతే భవిష్యత్తులో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గడ్డురోజులేనని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు నాయకులు శ్రీనివాస్‌గౌడ్, మహేశ్వర్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.