Runa Mafi | నర్సింహులపేట, ఆగస్టు 23: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ పరిధిలో రూ.2 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 2800 మంది ఉంటే.. 1200 మందికి మాత్రమే మాఫీ అయ్యింది. బ్యాంకు అధికారులు ఆడిట్ పేరుతో 20 రోజులుగా రుణమాఫీ వచ్చిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోజుకు 30 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తామని అధికారులు టోకెన్లు ఇస్తుండటంతో.. శుక్రవారం వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో బ్యాంకు వద్ద ఒక్కసారిగా తోపులాట జరిగి రామన్నగూడెం గ్రామానికి చెందిన 68 ఏండ్ల వృద్ధురాలు మంద సోమక్క గాయపడింది. తలకు గ్రిల్ తగలడంతో రక్తస్రావం జరిగింది. ఇంత జరుగుతున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడతున్నారు.
బ్యాంకులో తీసుకున్న లోన్ మాఫీ అయిందని నా కొడుకుతో కలిసి బ్యాంకుకు వచ్చిన. ఇక్కడ శాన మంది ఉండటంతో నేను లైన్ల నిలబడిన. బ్యాంకు వాళ్లు వచ్చి తలుపు(షటర్) తీయడంతో ఒక్కసారిగా నెట్టుకున్నారు. దీంతో నా తల ఇసుప కడ్డీకి(గ్రిల్)కు తగిలింది. రక్తం వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. పైసలు తీసుకునుడేమో కాని కొద్దిగైతే నా ప్రాణం పోతుండే. గాయపడిన నన్ను నా కొడుకు దవాఖానకు తీసుకపోయిండు.
-మంద సోమక్క, రైతు, రామన్నగూడెం
లోన్ పైసలు వచ్చినయని సంబురంగ బ్యాంకుకు వచ్చిన. ఇక్కడ చూస్తే శాన మంది ఉన్నారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది రైతులను చూసి చీదరించుకున్నారు. ఏదో వాళ్ల ఇంట్లో నుంచి పైసలు ఇచ్చినట్టు చూస్తున్నారు. ఓ పేపరు మీద ముద్రవేసి మంగళవారం (ఈ నెల 27న) రమ్మని చెప్పారు. అధికారులు వాళ్ల ఆడిట్ కోసం 20 రోజుల సంది మా పైసలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ల మంగళవారం రమ్మని చెబుతున్నారు. అధికారులు రైతుల బాధలు తీర్చాలి.
-బానోతు రాంసింగ్, రైతు, బాసుతండా