హైదరాబాద్, నవంబర్ 26(నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్‌లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సదస్సుకు మొదటి రెండు రోజులు 5వేల చొప్పున రైతులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాల ని ఆదేశించారు. 30న సదస్సుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని, అన్ని జిల్లా ల నుంచి కనీసం లక్ష మంది రైతులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్ర సామగ్రి, వివిధ రకాల పంట రీతులు, ప్రభుత్వ పథకాలపై సంబంధిత శాఖలు ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తాయని తెలిపారు. సదస్సును రాష్ట్రంలోని 560 రైతు వేదికల్లో ప్రత్యక్షప్రసారం చేయాలని ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.