Farmers | కొడకండ్ల, డిసెంబర్ 11: నాలుగు నెలలైనా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయకపోవడంతో కరెంటు లేక పంటలు పండించుకోలేక పోతున్నామని జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురం గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్ లేక నీళ్లు పారించక 40 ఎకరాలకుపైగా భూమిని వచ్చే యాసంగిలో పడావు పెట్టాల్సి వస్తుందని వాపోయారు. 20 మంది రైతులకు చెందిన 40 ఎకరాలకుపైగా వ్యవసాయ భూమికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ 4 నెలల కిందట కాలిపోయింది. అధికారులకు సమాచారమిచ్చినా ఇప్పటివరకు మరమ్మతులకు నోచుకోలేదు.
వానకాలంలో వర్షాల మీద ధైర్యంతో వరి పెట్టగా ఎంతోకొంత పండింది. వచ్చే యాసంగిలో ట్రాన్స్ఫార్మర్ మీదనే పూర్తి ఆధారపడాల్సిన పరిస్థితి. బోర్లు ఉన్నా కరెంటు లేక నీరు లేదని, అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పడావు పెట్టాలంటే బాధగా ఉందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పదేండ్ల కాలంలో ఏనాడూ పంటను వదిలి పెట్టలేదని, మొదటిసారిగా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత ఏఈని వివరణ కోరగా ట్రాన్స్ఫార్మర్లు లేవని, కొత్తవి వచ్చాక పాలకుర్తికి వెళ్లి తెచ్చుకోవాలని రైతులకు సూచించినట్టు చెప్పారు.
నాకు ఎకరం పొలం ఉంది. బోరుబావి నీరు పుష్కలంగా ఉందని పక్క రైతులది రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పండిచ్చేవాన్ని. కానీ ఈ సారి వానకాలం కరెంటు లేక పండించ లేకపోయిన. యాసంగిలోనైనా కరెంటు వస్తదేమోనని ఎదురుచూస్తున్న. నాలుగు నెలల క్రితం కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు నోచుకోలేదు. ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి చూడలేదు.
– జీడ్డి వెంకట్రాములు, రైతు, నర్సింగాపురం