తిప్పర్తి, సెప్టెంబర్16: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలానికి సాగునీరు అందించే డీ-40 కాల్వకు నీటిని విడుదల చేయాలని పలు గ్రామాల రైతులు సోమవారం కాల్వ వద్ద నిరసన తెలిపారు. రైతులు మాట్లాడుతూ.. నిరుడు సాగర్ ప్రాజెక్టులో నీళ్లు లేవని కాల్వకు నీటి విడుదల చేయలేదని, ప్రస్తుతం నాగార్జునసాగర్ పూర్తిస్థాయిలో నిండినప్పటికీ కాల్వకు నీరు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
డీ-40 కాల్వ ద్వారా తిప్పర్తి, పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, వెంకటాద్రిపాలెం, ఇండ్లూరు, సర్వారంతోపాటు మాడ్గులపల్లి, వేములపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. వానకాలం సీజన్ ముగిసే దశకు వచ్చినా నేటికీ కాల్వకు నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించి వెంటనే నీటిని విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.