పాలమూరు, జనవరి 29 : మహబూబ్‌నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. మంగళవారం నాటి ఆందోళనకు దిగివచ్చిన అధికారులు క్వింటాల్‌కు రూ.200 ధర పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పడంతో బుధవారం కూడా నిరసన చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పల్లి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించారు. పాత ధరకే కొంటుండటంతో రైతులు వ్యాపారులను నిలదీశారు.
ధర పెంచితే తమకు నష్టం వస్తుందని, తమపై భారం పడుతుందని తెగేసి చెప్పారు. దీంతో రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత రూ.200 పెంచుతున్నామని చెప్పినా వ్యాపారులు లెక్కచేయకుండా పాత ధరకు కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో ముందస్తుగా బయటకు వెళ్లకుండా మార్కె ట్ యార్డు గేట్లను మూసివేశారు.
మార్కెట్ కార్యాలయంలోకి కూడా వెళ్లకుండా అక్కడా గేట్ బంద్ చేశారు. మంగళవారం మార్కెట్ పాలకవర్గం ఇచ్చిన హామీ మేరకు క్వింటాకు రూ.200 పెంచి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వ్యాపారులతో చైర్పర్సన్, ఆర్డీవో, తహసీల్దార్, పోలీస్ అధికారులు సమావేశమయ్యారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ధర పెంచాలని నిర్ణయించడంతో ఆందోళన విరమించారు. పెంచిన ధర ఇవ్వకపోతే మళ్లీ నిరసనకు దిగుతామని రైతులు హెచ్చరించారు.