చేర్యాల, జనవరి 27 : వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల(Red gram) కొనుగోలు కేంద్రంలో తమ కందులు కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి(MLA Palla Rajeshwer reddy) ముందు తమ గొడును వెల్లబోసుకున్నారు. కందులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కోరారు. చేర్యాలలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వచ్చినట్టు సమాచారం అందుకున్న సదరు రైతులు ఎమ్మెల్యేను కలిశారు.
తాము కందులు తీసుకువచ్చామని, లారీ లోడ్ కావడం లేదని తదితర సమాధానాలు చెబుతూ కందులు కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యేకు తెలిపారు. రైతుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే పల్లా వెంటనే సంబంధిత శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే రైతుల కందులు కొనుగోలు చేయాలని, ప్రారంభం రోజున ఆదరబాదరగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభింపజేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన కందులను ఎలాంటి కోర్రీలు పెట్టకుండా ప్రభుత్వ మద్దతు ధర అందే విధంగా కొనుగోలు జరిపించాలని ఆదేశించారు.