రఘునాథపాలెం/దామెర, డిసెంబర్ 14 : దిగుబడులు ఆశాజనకంగా లేకపోవడం.. సాగు కోసం చేసిన అ ప్పులు భారంగా మారడంతో మనస్తాపానికి గురైన ఇద్దరు రైతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నా రు. ఈ ఘటనలు ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్నాయి. పోలీసుల కథనం ప్రకా రం.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడుకు చెందిన యువరైతు గునిపిన్ని భూపతిరావు (30) తన పొలానికి తోడుగా పక్క గ్రామమైన కోయచలకలో మరికొంత కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తున్నాడు.
పంట వైరస్‌తో ఎండిపోవడంతో సాగు కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. శనివారం తన పొలానికి వెళ్లిన భూపతిరావు భార్యకు ఫోన్ చేసి అప్పుల విషయాన్ని ప్రస్తావిస్తూ పురుగుల మందు తాగాడు. అప్రమత్తమైన భార్య గ్రామస్థుల సహాయంతో పొలానికి వెళ్లి భూపతిరావును ఖమ్మం తరలించే క్రమంలోనే మృతిచెందాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రఘునాథపాలెం సీఐ తెలిపారు.
హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగులాపురం గ్రామానికి చెందిన రైతు మన్నెం అనంతరెడ్డి (65) ఐదెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. సాగు కోసం 4 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి సరిగా రాక అప్పు తీర్చడం కష్టంగా మారింది. మనస్తాపానికి గురై ఈ నెల 6న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ అనంతరెడ్డి శనివారం మృతి చెందా డు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు.