బెల్లంపల్లి, జూన్ 6: ప్రభుత్వం సరైన ప్రణాళిక, ముందస్తు చర్యలు తీసుకోకుండా నిర్వహిస్తున్న భూభారతి సదస్సులు రణరంగంగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరోఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన తహసీల్దార్ కృష్ణ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో భూభారతి సదస్సు నిర్వహించారు. ఉదయం నుంచి సదస్సు సాఫీగా సాగింది. భోజన విరామం తర్వాత గ్రామానికి చెందిన పూదరి రమేశ్ తన నాలుగు ఎకరాలకు విరాసత్ చేయించాలని అధికారులకు దరఖాస్తు అందించాడు.
విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన మైళ్ల రాజ్‌కుమార్ అక్కడికి చేరుకుని, తాను సాగు చేసుకుంటున్న భూమికి విరాసత్ దరఖాస్తు ఎలా చేసుకుంటావని రమేశ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి, పరస్పరం చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా కార్యాలయంలో ఉన్న వంట సామగ్రి, ఇతర వస్తువులతో దాడి చేసుకున్నారు. స్థానికులు, రెవెన్యూ సిబ్బంది వారిని అడ్డుకున్నా వినిపించుకోకుండా పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారించేందుకు ప్రయత్నించిన రెవెన్యూ సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారు. చివరికి తాళ్లగురిజాల ఎస్ఐ చుంచు రమేశ్ వచ్చి ఇరువురిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై తాళ్లగురిజాల పోలీస్‌స్టేషన్‌లో రమేశ్, డీసీపీ కార్యాలయంలో రాజ్‌కుమార్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.