మక్తల్, జూన్ 5 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తాము సర్వం కోల్పోతామని, అందుకే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున పరిహారమిస్తేనే భూములిస్తామని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన రైతులు ఆర్డీవోకు తేల్చి చెప్పారు. గురువారం మక్తల్ మండలం కాట్రేవుపల్లి శివారులోని ఎర్నగానిపల్లిలో ఆర్డీవో రాంచంద్రనాయక్ ఆధ్వర్యంలో భూములు కోల్పోతున్న రైతులతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని తెలిపారు.
ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ సర్వేకు రైతులు సహకరించాలని కోరగా.. 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా నష్టపరిహారాన్ని అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. గతంలోనే భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో 300 ఎకరాలకుపైగా భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని, మిగిలిన భూమిని కూడా పేట-కొడంగల్ ప్రాజెక్టుకు తామెలా బతకాలని ప్రశ్నించారు. అందుకే ప్రభుత్వం ఎకరాకు రూ.70 లక్షల పరిహారం అందించడంతోపాటు కాట్రేవుపల్లి గ్రామాన్ని ఆర్ఆర్ సెంటర్‌గా మార్చి భూములు కోల్పోతున్న కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులెవరూ అధికారులకు సహకరించకపోవడంతో సమావేశాన్ని ముగించారు.