Greenfield Road | ఆమనగల్లు, జనవరి 8: ‘మా ప్రాణాలు బో యినా రోడ్డేయనియ్యం.. బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణత్యాగానికీ వెనుకాడం.. అప్పుడు మా శవాలపై రోడ్డు వేసుకోండి’ అంటూ సాకిబండ తండా గిరిజన రైతులు తెగే సి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండోవిడత గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు సర్వేను బుధవా రం గిరిజన రైతులు అడ్డుకున్నారు. తమ ప్రా ణాలు కోల్పోయినా సరే సర్వే జరగనిచ్చే ప్రస్తకే లేదని, ఆ సర్వే జరిగే ప్రదేశంలోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. రైతులు తిరుగుబాటుతో సర్వేబృందం పైఅధికారులకు సమాచారం అందించి సర్వే జరపకుండానే వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. కందుకూరు మండలం బేగరికంచ వద్ద నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ కోసం తొలి విడతగా కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి పం జాగూడ వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి సర్వే పూర్తిచేసింది.
రెండో విడుతలో భాగంగా 21 కి.మీ పొడవున 330 అడుగుల వెడల్పుతో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం 554 ఎకరాల భూమిని సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండాకు అధికారులు, రెవెన్యూ సిబ్బంది, సర్వే బృందం రావడంతో వారిని గిరిజన రైతులు అడ్డుకున్నారు. ‘ఎలాంటి నోటీసు లు ఇవ్వకుండా మా భూముల్లో సర్వేచేసే అధికారం మీకెక్కడిదని అధికారుల బృందంపై గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మించవద్దని ఎమ్మెల్యే, డీఆర్వో, ఆర్డీవోలను కలిసి వినతిపత్రం అందజేసినా మళ్లీ సమాచారం లేకుండా రావడమేమిటి? మాకున్న పావు ఎకరం, అర్ధెకరం, ఎకరం, రెండెకరాలను రోడ్డు కోసం తీసుకుంటే మా జీవనం సాగేదేట్లని అధికారులను నిలదీశారు”
తమ భూములు బలవంతంగా లాక్కోవలని చూస్తే తాము ప్రాణత్యాగానికైనా వెనుకాడమని గిరిజన రైతులు తేగేసి చెప్పారు. రోడ్డు వేయాల్సివస్తే తమ శవాల మీదుగా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ‘అధికారులు గో బ్యాక్, మా ప్రాణలైనా అర్పిస్తాం- గ్రీన్ ఫీల్డ్ రోడ్డు అడ్డుకుంటాం’ అన్న రైతుల నినాదాలు పొలాల్లో మార్మోగాయి. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. గిరిజన రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రైతులు రవిరాథోడ్, మణిపాల్, బోడ్యి, చందర్, పాండు, రమేశ్, గోపి, లాలు, విజేందర్, రాజా, వినోద్, గోపి, శివరాం, జాన్యా, పత్య, కుమార్, హరి, తరుణ్, కుమార్, మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం మా భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. మాకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ మేము మా పిల్లలు జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం బలవంతంగా రోడ్డు కోసం మా భూమిని లాక్కుంటే మాకు మాత్రం చావే దిక్కు. మేము చచ్చాక మా శవాల మీదుగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మించుకోండి.
– నేనావత్ చంప్లీ, సాకిబండతండా
సీఎం రేవంత్‌రెడ్డి స్వలాభం కోసమే ఈ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తున్నారు. మాకు 4 కిలోమీటర్ల దూరంలోనే 765 జాతీయ రహదారి ఉన్నది. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ జాతీయ రహదారిని అభివృద్ధి చేయండి. ఈ రోడ్డు ఎవరి కోసం నిర్మిస్తున్నాడో సీఎం మాకు చెప్పాలి. ఈ రోడ్డేస్తే నాకున్న 5 ఎకరాలు పోతుంది. ఇక నేను హైదరాబాద్‌లో వాచ్‌మ్యాన్‌గా బతకాలి.
– రవి రాథోడ్. సాకిబండతండా
ఈ భూములు మా తాతల తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినవి. ఈ భూములను నమ్మి మేము వ్యవసాయం చేసుకుంటూ మా పిల్లలకు చదివించినం, పెండ్లీలు చేసినం. ఇప్పుడు వచ్చి అర్థంతరంగా రోడ్డు వేస్తామంటే మా బతుకులు ఆగమై పోతాయి సారు. మీకు దండాలు పెడ్తాం, మీ కాళ్లు మొక్కుతాం.. మాకే రోడ్డూ వద్దు సారూ.
– నేనావత్ కేస్లీ, సాకిబండతండా
రోడ్డు నిర్మిస్తరని, మా భూమి మొత్తం పోతుందని తెలిసింది. అప్పటి నుంచి మా ఇంట్ల సరిగ్గా తిండి కూడా తినడం లేదు. నిద్ర కూడా పట్టడం లేదు. ఈ వయస్సులో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఆనుకోలేదు. మా పొలాలెంట దొంగల్లాగ వచ్చి మిషన్లు పట్టుకుని తిరుగుతున్నరు. మేము మాత్రం రోడ్డు కోసం మా భూములను ఇవ్వం. అవసరమైతే నా భూమిలోనే సచ్చిపోత.
– లచ్య, సాకిబండతండా
సీఎం రేవంత్ మా గిరిజనులపై కక్షగట్టిండు. మొన్న లగచర్లలో గిరిజన రైతు ల నుంచి భూములు లాక్కునే ప్రయ త్నం చేసిండు. అక్కడ గిరిజన రైతులు తిరగబడితే వాళ్లను జైల్లో పెట్టించిండు. మళ్లీ మా ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు అని మా గిరిజన రైతులకు ఉన్న కొద్దిపాటి భూములను లా క్కొనే ప్రయత్నం చేస్తుండు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వానికి గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రోడ్డును రద్దుచేయాలి.
– పత్యానాయక్, బీఆర్ఎస్ ఆమనగల్లు అధ్యక్షుడు
నా జీవితంలో ఇప్పటివరకు ఇసొంటి సీఎంని చూడనేలేదు. మా ప్రాంతమోడని ఓట్లేసి గెలిపించిరు. ఇప్పటివరకు రైతు భరోసా లేనే లేదు. రుణమాఫీ సక్రమంగా చేయనేలేదు. అభివృద్ధి చేస్తడని గెలిపిస్తే మా భూములనే లాక్కుంటుండు. మాకు ఏ రోడ్డు లేకున్నప్పుడే మేము మంచిగా బతికినం. ఈ రోడ్డుతో మాకు ఏ పనీ లేదు. మా భూముల జోలికి మాత్రం రావొద్దు. వస్తే మా ప్రాణాల్ని పణంగా పెడతాం.
– సభావత్ వెంకటి