చౌటుప్పల్, సెప్టెంబర్ 12 : రీజినల్ రింగ్ రోడ్డు భూనిర్వాసితులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. జిల్లా పరిధిలోని చౌటుప్పల్, సంస్థాన్‌నారాయణపురం, వలిగొండ మండలాల్లోని వివిధ గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులు పెద్ద ఎత్తున ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ‘ట్రిపుల్ ఆర్ వద్దురా..వ్యవసాయ భూములే ముద్దురా’ అని రైతులు నినాదాలు చేశారు. ప్రాణాలైనా వదులుకుంటాము గానీ భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. అనంతరం ఆర్డీవో శేఖర్ రెడ్డికి అలైన్మెంట్ మార్చాలని వినతి పత్రం సమర్పించారు. 65వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తుండగా రైతులు, నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం: ప్రభాకర్ రెడ్డి
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..ఆయన తమ్ముడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బడా పరిశ్రమ మేతకోసం ఆశపడి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భూనిర్వాసితులకు బహిరంగ మార్కెట్ కన్నా మూడు రెట్లు పరిహారం ఎక్కువ ఇవ్వాలని, లేదంటే గోల్డెన్ ఫారెస్ట్ భూములను కొనుగోలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు.