అచ్చంపేట/అచ్చంపేటటౌన్/కల్వకుర్తి రూరల్, జనవరి 27: పల్లీకి మద్దతు ధర దక్కకపోవడంతో కడుపు మండిన రైతులు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ కార్యాలయంపై దాడి చేశారు. మార్కెట్ సెక్రటరీతోపాటు చైర్పర్సన్ భర్తపైనా దాడికి దిగారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. కల్వకుర్తిలోనూ రైతులు ఆందోళనకు దిగారు. రైతుల కథనం ప్రకారం వివరాలు ఇలా.. సోమవారం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, అమ్రాబాద్ ఇతర మండలాల నుంచి రైతులు పల్లీని తీసుకువచ్చారు. మార్కెట్లో వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై పల్లీ పంట నాణ్యతను గుర్తించకుండా ఎవరికి వారు ఇష్టానుసారంగా తక్కువ ధరలు నిర్ణయించారు.
మూడు రోజుల కిందటి వరకు క్వింటాకు మద్దతు ధర రూ.7 వేల పైచిలుకు ఉండగా సోమవారం ఒక్కసారిగా రూ.3 వేలు తగ్గించడంతో రైతులు ఆగ్రహానికిగురై అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అంతటి రజిత భర్త అంతటి మల్లేశ్ మాట్లాడుతుండగా ఆగ్రహానికి గురైన రైతులు ఆయనపై దాడిచేశారు. అంగీపట్టి లాగడంతో పూర్తిగా చినిగిపోయింది. అధికారులు, సిబ్బంది భయాందోళనతో కార్యాలయంలోకి పరుగెత్తగా.. వారిని వెంబడించారు. సెక్రటరీ నర్సింహులుపై దాడి చేశారు. కార్యాలయంలోన్లి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
అక్కడి నుంచి రైతులు పెద్ద సంఖ్యలో అచ్చంపేటలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎస్సై రమేశ్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించి వారిని మార్కెట్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి చెమటోడ్చి, పండించిన పంటను అమ్ముదామని మార్కెట్‌కి తీసుకొని వస్తే వ్యాపారులు నాణ్యతను పరిశీలించకుండా ఇష్టమొచ్చిన రేటు నిర్ణయిస్తూ తూకాల్లో మోసాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఒకే రైతుకు చెందిన ఒకే పొలంలో పండిన పంటను రెండు కుప్పలు పోయగా ఒకే పంటకు రెండు రేట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. మార్కెట్లో జరుగుతున్న మోసాలను అరికట్టి న్యాయం జరిగే వరకు కొనుగోళ్లు నిలిపి వేయాలని కోరారు. ప్రభుత్వం, అధికారులు దిగివచ్చి రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాలని రైతులు డిమాండ్ చేశారు.
కల్వకుర్తిలోనూ ఆందోళన
పల్లీ పంటకు మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం వారు నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు వివిధ గ్రామాల రైతులు పల్లీలను విక్రయానికి తీసుకురాగా వ్యాపారులు సరైన ధరను టెండర్ చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ చౌరస్తాకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇతర మార్కెట్ యార్డుల్లో పల్లీకి మద్దతు ధర దాదాపుగా రూ.7,500 ఉండగా కల్వకుర్తిలో మాత్రం రూ.5,400 ఎలా చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. వ్యాపారులు తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తమకు న్యాయం చేయాలని, లేదంటే రీ టెండరింగ్ వేయాలని డిమాండ్ చేశారు. వెల్దండ సీఐ, కల్వకుర్తి పోలీసులు, వ్యవసాయ మార్కెట్ పాలక మండలి సభ్యులు రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. అదేసమయంలో మార్కెట్ యార్డుకు చేరుకున్న రాష్ట్ర వ్యవసాయ కమిటీ సభ్యుడు కేవీఎన్ రెడ్డి రైతులను నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ‘సీఎం డౌన్‌డౌన్.. వద్దురా వద్దురా కాంగ్రెస్ పాలన వద్దురా’.. అంటూ రైతులు నినదించారు.