అర్హులైన రైతులందరికీ రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేయాలని కోరుతూ సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తురకగూడెం గ్రామానికి చెందిన రైతులు పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరాలు రాసి పోస్టు చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారందరికీ రుణమాఫీ వర్తించే విధంగా చూడాలని కోరారు.
– కూసుమంచి
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే కాంట్రాక్టు గురుకుల టీచర్లు (సీఆర్టీలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ ఎదుట చేపట్టిన దీక్ష శనివారం తొమ్మిదో రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా బతుకమ్మలతో నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం ఎదుట సీఆర్టీలు చేపట్టిన రిలే దీక్షకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆదిలాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మద్దతు తెలిపారు. అనంతరం సీఆర్టీలకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి రూ.25 వేల ఆర్థికసాయం అందజేశారు.
– భద్రాచలం, ఉట్నూరు
ఏడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం పంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. జనగామ కలెక్టరేట్ ఎదుట పంచాయతీ సిబ్బంది ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్, డిచ్పల్లి, రుద్రూర్, కోటగిరి, ఎడపల్లి తదితర మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట బైఠాయించారు. పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట ర్నా చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రెండో రోజు సమ్మె కొనసాగింది. కార్మికులు హైవేపై రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా సమ్మె కొనసాగింది.
– నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్