వికారాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా మీదుగా వెళ్లనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ వద్దేవద్దని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో పెద్ద మొత్తంలో పట్టా భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పాత అలైన్మెంట్ 75 శాతం మేర ప్రభుత్వ, బీడు భూముల మీదుగా వెళ్తే.. కొత్త అలైన్మెంట్ వల్ల ఒక్క నవాబుపేట్ మండలంలోనే 200 ఎకరాల వరకు పట్టా భూములను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడుతున్నారు. కేవలం ప్రభుత్వ పెద్దల కోసం, వెంచర్ల యజమానులకు నష్టం రాకుండా పాత అలైన్‌మెంట్‌ను మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్ వద్ద నవాబుపేట్ మండల రైతులు ధర్నా చేపట్టారు.
ఆర్ఆర్ఆర్ కొత్త అలైన్మెంట్ ప్రకారం ఒకట్రెండు ఎకరాలున్న రైతులు పూర్తిగా భూములను కోల్పోవాల్సి వస్తుందని, వెంటనే కొత్త అలైన్‌మెంట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కొత్త అలైన్మెంట్ ప్రకారం.. వికారాబాద్ జిల్లాలోని పూడూర్, వికారాబాద్, నవాబుపేట్, మోమిన్‌పేట్ మండలాల మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు వెళ్లనుందని, ఈ గ్రామాల్లో భూముల ధరలు ఎకరం రూ.కోట్లలో ఉన్నాయని, భూములు కోల్పోతే ప్రభుత్వం అందజేసే అరకొర సాయంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు.
నవాబుపేట్ మండలంలోని పులిమామిడి, లింగంపల్లి, చీమలదరి, మాదిరెడ్డిపల్లి, నారాగూడెం, పూలపల్లి గ్రామాల్లో ఎకరం రూ.2 కోట్లకుపైగా ఉండటంతో కొత్త అలైన్‌మెంట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త అలైన్‌మెంట్‌ను ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక నవాబుపేట్ మండలంలో పూలు, కూరగాయలను అధికంగా సాగు చేస్తారని, పులిమామిడి, లింగంపల్లి, చీమలదరి, మాదిరెడ్డిపల్లి, నారాగూడెం, పూలపల్లి గ్రామాల్లో పండించే కూరగాయలను హైదరాబాద్‌కు తరలిస్తారని, ఈ గ్రామాల్లో ఐదెకరాలలోపు ఉన్న రైతులంతా కూరగాయల సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ట్రిపుల్ ఆర్‌లో భూములు కోల్పోతే ఆయా గ్రామాల రైతులు రోడ్డున పడటంతోపాటు హైదరాబాద్‌కు కూరగాయల కొరత కూడా ఏర్పడుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త అలైన్‌మెంట్‌ను మార్చాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ట్రిపుల్ ఆర్ కొత్త అలైన్‌మెంట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదు. ప్రభుత్వం ముందుకెళ్తే మేం తీవ్రంగా ఉద్యమిస్తాం. పాత అలైన్మెంట్ ప్రభుత్వ భూముల మీదుగా వెళ్లింది. ఏం జరిగిందో ఏమో తూర్పువైపు మార్చడంతో పట్టా భూములు కోల్పోవాల్సి వస్తుంది. ఏడాదికి మూడు పంటలు పండే భూములున్నాయి. బావులు, బోర్లు ఉన్నాయి. కేవలం రైతులకే కాదు.. హైదరాబాద్‌కు కూరగాయల కొరత ఏర్పడుతుంది.
-భూపతిరెడ్డి, పులిమామిడి
రింగ్‌రోడ్డు పాత అలైన్మెంట్తో ప్రభుత్వ భూములు, బీడు భూములు పోయేవి. కొత్త అలైన్మెంట్తో పట్టా భూములు, బోర్లు, బావులు కోల్పోతాం. మాకు వేరే దగ్గర భూము లు లేవు. ఈ భూముల మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఉన్న ఐదెకరాల భూమిని ట్రిపుల్ ఆర్తో కోల్పోతే మా కుటుంబమంతా రోడ్డున పడుతుంది. కొత్త అలైన్‌మెంట్‌ను మార్చి పాత అలైన్‌మెంట్‌ను కొనసాగించాలి.
-గవ్వల మొగలయ్య, మాదిరెడ్డిపల్లి, నవాబుపేట్ మండలం
మా భూమి దగ్గర సర్వే నంబర్ 172 అని గుర్తు వేశారు. మాకున్న మొత్తం ఐదెకరాల భూమి పోతదని ఇంటిల్లిపాది తిండితిప్పలు లేకుండా ఆందోళనతో ఉన్నాం. చదువుకున్నాం కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదు. మాకు ఉన్న ఐదెకరాలపైనే మా కుటుంబమంతా ఆధారపడి జీవిస్తున్నది. ఏటా మూడు పంటలు పండిస్తున్నాం. ఈ భూములు పోతే మాకేం ఆధారం లేదు. పాత అలైన్‌మెంట్‌ను అమలు చేయాలి.
-కల్పగురి రాఘవేందర్, మాదిరెడ్డిపల్లి, నవాబుపేట్ మండలం
ట్రిపుల్ ఆర్ కోసం పూలపల్లిలో ఎస్-168 నుంచి ఎస్-174 వరకు గుర్తులు వేశారు. మాకు ఆందోళనగా ఉంది. కొత్త అలైన్‌మెంట్‌కు కొద్ది దూరం నుంచే ప్రభుత్వ భూములున్నాయి కాబట్టి.. ప్రభుత్వ భూముల మీదుగా వెళ్తే అందరం ఆహ్వానిస్తాం. పట్టా భూములున్న రైతుల జోలికి రావొద్దు. ఒకవేళ మా డిమాండ్‌ను కాదని సర్కారు ముందుకెళ్తే.. రైతులమంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
-మాణిక్‌రెడ్డి, పూలపల్లి, నవాబుపేట్ మండలం