ఇల్లెందు/ రెబ్బెన/ ముథోల్, జూలై 11 : యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడంలేదు. నిర్మల్ జిల్లా ముథోల్ పీఏసీఎస్‌కు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకొన్న రైతులు శుక్రవారం వేకువజామునుంచే కార్యాలయం వద్ద బారులు తీరారు. కొందరు రైతులు గంటల తరబడి నిలబడలేక చెప్పులను వరుసక్రమంలో పెట్టారు. 450 బస్తాల యూరియా రాగా ఐదు సంచుల చొప్పున అందజేశారు. మిగతా రైతులు చేసేదిలేక వెనుదిరిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గంటల తరబడి నిలబడినా ఎరువులు దొరకడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రెబ్బెన పీఏసీఎస్‌కు శుక్రవారం నాలుగు లారీల యూరియా వచ్చినట్టు తెలియడంతో రైతులు పెద్దసంఖ్యలో చేరుకొని యూరియా అందించాలని కోరారు. సర్వర్ డౌన్ ఉందని, బయోమెట్రిక్ పనిచేయడంలేదని, యూరియా బస్తాలు ఇప్పుడు ఇవ్వడం కుదరదని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహించిన రైతులు యూరియా స్టాక్ ఉన్నప్పటికీ సాకులు చెబుతూ పంపిణీ చేయడంలేదని మండిపడ్డారు.
రెబ్బెన ఏవో దిలీప్ వారితో మాట్లాడి రాస్తారోకో విరమింపజేశారు. ఆగ్రో రైతు సేవా కేంద్రానికి సంబంధించిన బయోమెట్రిక్ తెప్పించి యూరియా పంపిణీ చేశారు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న సొసైటీ గోడౌన్ వద్దకు శుక్రవారం తెల్లవారు జామున 5 గంటలకే రైతులు వచ్చి యూరియా కోసం పడిగాపులు కాశారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరతలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే యూరియా కోసం క్యూలు కట్టాల్సి వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. తెల్లవారుజామున 5 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 గంటల యూరియా బస్తా లభించిందని ఒడ్డుగూడెం రైతు భూక్యా సురేశ్ తెలిపారు. దీని కోసం మూడు రోజులపాటు వ్యవసాయ పనులు మానుకొని తిరగాల్సి వచ్చిందంటూ ప్రభుత్వంపై మండిపడ్డాడు.