హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగా ణ): గతంలో ఇట్లా ఇబ్బంది కాలేదు…నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఎడపల్లిలోని సిండికేట్ బ్యాంకులో రూ.1.33లక్షలు రుణం తీసుకున్నా. రుణమాఫీ మూడో జాబితాలోనూ పేరు రాలే. బ్యాంకు అధికారులను, వ్యవసాయాధికారిని అడిగితే ఆధార్ కార్డు నంబర్ కొడితే వేరే సమాచారం చూపిస్తున్నదని అంటున్నరు. వారం రోజుల తర్వాత రమ్మంటున్నరు. మాకు రుణమాఫీ వర్తింపజేయాలి.
యువరైతు ఆత్మహత్యాయత్నం
చిన్నకోడూరు ; సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం మధిర గ్రామం ఎల్లమ్మజాలులో శనివారం రైతు వంకాయల రాజు తనకు చెందిన రెండు లక్షల పంట రుణమాఫీ కాలేదని మనస్తాపంతో పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, పక్కనున్న రైతులు అడ్డుకున్నారు. ఈ వీడియా సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నకు ఈ వీడియో చేరవేయాలని ఆ వీడియోలో వేడుకున్నాడు.
23
రాజకీయంగా రుణమాఫీ చేయలేదు
నాకు మూడెకరాల 20 గుంటల భూమి ఉంది. సొసైటీ బ్యాంకులో రూ.1,74,024 రుణం తీసుకున్నా. కానీ నాకు అర్హత ఉన్నా రుణమాఫీ కాలేదు. నేను సీపీఎం తరుపున ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తునందుకే నాకు చేయలే. కాంగ్రెస్ నాయకులు కావాలనే ఇలా చేశారు. ప్రభుత్వం రుణమాఫీపై గొప్పలు చెప్పింది కానీ.. అచరణలో మాత్రం చేయడం లేదు.
– శివ వర్మ, రైతు, సీపీఎం నాయకుడు, ముక్కిడిగుండం, నాగర్‌కర్నూల్ జిల్లా
నేను ఏ తప్పు చేసిన
నేను గిరిజన రైతును. నేను రూ.98వేలు తీసుకున్న. అర్హత ఉన్నా నా పేరు రుణమాఫీ లిస్టులో లేదు. ఇప్పుడు పంట వేసుకునేందుకు డబ్బులు లేక పొలం బీడుగా పెట్టుకున్న. ఉన్న పాసుబుక్ బ్యాంకులో ఉన్నది. ఎవరూ నాకు అప్పు ఇస్తలేరు. నేను ఏం తప్పు చేసిన. నాకు ఎందుకు వర్తింపజేయలేదో అర్థం కావడం లేదు. నాకు ఎందుకు ఇయ్యలేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.
– పూల్య నాయక్, రైతు, ముక్కిడిగుండం, నాగర్‌కర్నూల్ జిల్లా
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో..
తమకు రెండు లక్షల రుణ మాఫీ కాలేదంటూ ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లికి చెందిన 50 మంది రైతులు శనివారం కలెక్టరేట్లోని సహాయ కేంద్రానికి చేరుకున్నారు. ఆ వెంటనే కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన గేటు ముందు నుంచి జాతీయ రహదారిపైకి చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి, జిల్లా మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
మూడో జాబితాలో లేదు
నాకు రెండెకరాల 30 గుంటల భూమి ఉంది. రూ.80 వేల క్రాప్‌లోన్ తీసుకున్న. మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ అయ్యిందని బ్యాంకుల చుట్టూ తిరిగితే కాలేదని అధికారులు చెప్పిండ్రు. మూడో విడత జాబితాలోనూ నా పేరు రాలే. అసలు, వడ్డీ కలిపి రూ.1,39,500 రుణం ఉన్నట్టు బ్యాంక్ సారోళ్లు చెబుతున్నరు. అప్పు కట్టమంటున్నరు. కానీ మాఫీ గురించి ఏం చెప్పట్లే. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
-బంగారమ్మ, ముక్కిడిగుండం, కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
కామారెడ్డి జిల్లాలో..రాజంపేట మండలం ఆరెపల్లితండాకు చెందిన రైతు కెతావత్ హరి భార్య పేరిట రూ.2లక్షల రుణం ఉన్నది. మూడో విడుత రుణమాఫీ జాబితాలో పేరు లేకపోవడంతో కామారెడ్డిలోని కలెక్టరేట్‌కు వెళ్లగా అధికారులెవరూ పట్టించుకోలేదు. దీంతో జంగంపల్లి గ్రామానికి చేరుకొని శివారులోని సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపారు. రుణమాఫీ కాలేనందున టవర్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబసభ్యులకు, మీడియాకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఘటనా స్థలానికి కుటుంబసభ్యులు, మీడియా, గ్రామస్తులు చేరుకొని హరిని సముదాయించడంతో దిగొచ్చాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, అర్హులకు రుణమాఫీ కాలేదని ఆరోపిస్తూ రైతులు శనివారం రహదారిపై రాస్తారోకో చేశారు. రుణమాఫీ జాబితాలో పేర్లు రాకపొవడంతో ఎక్కడ తప్పిదం జరిగిందా? అని రైతులు ఆరా తీశారు. రుణాలు తీసుకోకున్నా తీసుకున్నట్లు, మాఫీ అయినా మాఫీ కానట్లు, చనిపోయిన వారికి సైతం రెన్యువల్ అయినట్టు గుర్తించామని రైతులు తెలిపారు.
రైతుగుండెలో కాంగ్రెస్ గునపం పోట్లు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘దేవుళ్ల మీద రేవంత్‌రెడ్డి ఒట్లు.. తెలంగాణ రైతాంగం గుండెల్లో గునపం పోట్లు’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న మోసపూరిత వైఖరికి పోస్టర్లు అద్దంపడుతున్నాయి. ‘రుణమాఫీపై మాట తప్పి మోసం.. రైతాంగం పాలిట కాంగ్రెస్ శాపం’, ‘కాంగ్రెస్ కుతంత్రం.. రుణమాఫీ తూతూ మంత్రం’ అని కాంగ్రెస్ పార్టీ ద్వంద్వనీతిని ఎండగడుతూ వెలసిన పోస్టర్లు ప్రధాన కూడళ్లల్లో చర్చనీయాంశంగా మారాయి. రుణమాఫీపై రేవంత్‌రెడ్డి సర్కార్ ఆయా సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను, ఎన్నికల ముందు నమ్మబలికిన తీరును పోస్టర్లు కండ్లకు కడుతున్నాయి. రుణమాఫీపై ‘మొదట చెప్పింది రూ.40వేల కోట్లు…రెండోసారి చెప్పింది రూ. 31వేల కోట్లు….చేసింది మాత్రం రూ. 17వేల కోట్లు’ అని సీఎం రేవంత్‌రెడ్డి సహా ఉపముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను క్రోడీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వెలసిన పోస్టర్లు రచ్చబండ దగ్గర చర్చకు తెరలేపాయి.
రేవంత్‌వి బూటకపు మాటలే..
రేవంత్ సర్కారు చేసిన రూ.2 లక్షల రుణమాఫీలో మా ఊళ్లోనే 99 శాతం మంది అర్హులు ఉన్నారు. అయినా చాలా మందికి కాలేదు. నాకు రెండెకరాల 12 గుంటల భూమి ఉంది. రూ.85 వేలు క్రాప్‌లోన్ తీసుకున్న. అర్హత ఉన్నా లిస్టులో నా పేరు రాలే. కారణాలు తెలుసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరిగుతున్న. అధికారులు కారణాలు చెప్పడం లేదు. ప్రభుత్వం బూటకపు మాటలు నమ్మి మోసపోయిన.
-మల్లేశ్, ముక్కిడిగుండం, కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో..
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రైతులు రాస్తారోకో చేశారు. వెంటనే అందరికి రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.అరకొర రుణమాఫీతో మిగతా రైతులకు ఎగ్గొడతామంటే సహించేది లేదని కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.