మొయినాబాద్, జూలై 15: దళిత రైతులు సాగు చేసుకుంటున్న ఎన్కేపల్లి ప్రభుత్వ భూములను గోశాలకు ఇవ్వాలని ప్రతిపాదించడాన్ని కొందరు రైతులు వ్యతిరేకిస్తుంటే.. మరి కొందరు సమ్మతించారు. మంగళవారం అధికారులు పట్టాలను పంపిణీ చేపట్టగా .. ఎకరానికి 500 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొందరు రైతులు ఆందోళన చేస్తుంటే, మరి కొంత మంది 300 గజాలకే పట్టాలు తీసుకున్నారు.
ఆందోళన చేస్తున్న రైతులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకునేలోపు ఇష్టపూర్వకంగా తీసుకోవడానికి వచ్చిన రైతులకు ఎమ్మెల్యే యాదయ్య పట్టాలు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనను నీరు గార్చేందుకు యత్నించిన మాజీ సర్పంచ్ అమర్నాథ్రెడ్డి కారు బీజాపూర్ జాతీయ రహదారిపై ఉండగా రైతులు ధ్వంసం చేశారు.
పట్టాల పంపిణీ ముగించుకుని ఎమ్మెల్యే మండల పరిషత్ కార్యాలయం నుంచి వెళ్దామనుకునే సమయంలో అన్ని గేట్ల వద్ద రైతులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై రైతులు, వారి పిల్లలు బైఠాయించి ఆందోళన చేయగా పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లో ఎక్కించి శంకర్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడే ఉన్న కొందరు మహిళలు కన్నీరు పెట్టి పోలీసుల కాళ్ల మీద పడి తమ పిల్లలను వలిపెట్టాలని వేడుకున్నారు.