ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో(Adilabad) సోయాబీన్ రైతుల(Soyabeen) ఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ నుండి రైతుల ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డ్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పత్తి వాహనాలు మార్కెట్ యార్డులోనికి వెళ్లకుండా రైతులు అడ్డుకున్నారు. రైతుల ఆందోళనతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.
కాగా, ప్రభుత్వ తీరుకు నిరసనగా నిన్న జిల్లా బేల మార్కెట్ యార్డులో(Bela market yard) మోకాళ్లపై కూర్చొని రైతులు వినూత్న నిరసన చేపట్టారు. 15 రోజులుగా పంట అమ్మడానికి రైతులు పడిగాపులు కాయగా.. మార్క్ ఫెడ్ అధికారులు ఇటీవల కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పంటను అధికారులు నా పేఢ్ గోదాములకు తరలించగా అక్కడ అధికారులు పంటను తిరస్కరించారు. దీంతో రైతులు తమ పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.
ప్రభుత్వం నామాత్రంగా కొనుగోళ్లు చేస్తుందని, నిబంధనల పేరుతో రైతులను వేధింపులకు గురిచేస్తుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలంటూ ఆందోళనలు చేసినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు పంటను విక్రయించి నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. యాసంగి పెట్టుబడుల కోసం తాము ప్రైవేట్ వ్యాపారులకు పంటను విక్రయిస్తున్నట్లు రైతులు తెలిపారు.