కురవి, మార్చి 31: ‘తలాపున పారుతుంది గోదారి.. మా చేను చెలక ఎడారి’ అన్న ప్రజాకవి మాటలు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు రెవెన్యూ పరిధి స్టేషన్ గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నది. 250 ఎకరాల ఆయకట్టుకు సాగునీరిచ్చేందుకు గ్రామం వద్ద నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ (ఎత్తిపోతల) పథకం ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. గ్రామ సమీపంలో మున్నేరు ప్రవహిస్తున్నా సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో మున్నేరు వరదల కారణంగా చెక్‌డ్యామ్ నుంచి ఇన్‌టెక్‌వెల్‌కు నీటిని తీసుకొచ్చే పైప్‌లైన్, ఇన్‌టెక్ వెల్(బావి)పూర్తిగా పూడికతో నిండిపోయింది. చెక్‌డ్యాం నుంచి ఇన్‌టెక్‌వెల్‌కు వచ్చే తూము(గేట్) కూడా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉండగా సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదురొంటున్నారు.
నీటి కొరత కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు సాగుచేయలేక పొలాలను వదిలిపెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. మున్నేరు వాగు పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. కోట్లాది రూపాయలతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకునేవారు లేకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఇన్టెక్వెల్లో పూడిక తొలగించి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. ఎస్సారెస్పీ కాలువల ద్వారా మున్నేరులోకి నీటిని విడుదలచేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.