హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేసిన సర్కారు.. బోనస్ పైసలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నెల గడుస్తున్నా ఒక్క రైతు ఖాతాలో కూడా నయా పైసా జమ కాలేదని మండిపడుతున్నారు. బోనస్ పైసలివ్వండి మహాప్రభో అంటూ రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సంబంధిత దస్త్రం ప్రాసెస్‌లో ఉందని, అధికారులు చెప్తున్నారు. ఎప్పటిలోగా ఆమోదం పొందుతుందో స్పష్టత ఇవ్వడంలేదు. సన్నాలకు బోనస్ అంటూ అట్టహాసంగా ప్రచారం చేసుకున్న ప్రభుత్వ పెద్దలు, నిధులు మాత్రం విడుదల చేయడంలేదని రైతుసంఘాల నేతలు మండిపడుతున్నారు.
యాసంగిలో 72.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల సంస్థ ప్రకటించింది. ఇందులో 3.66 లక్షల మంది రైతుల నుంచి 22.20 లక్షల టన్నుల సన్న ధాన్యం సేకరించినట్టు పేర్కొంది. ఈ లెక్కల ప్రకారం క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.1110.19 కోట్లు రైతులకు చెల్లించాలి. మద్దతు ధర పైసల కోసం బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తున్నామని పౌరసరఫరాలసంస్థ అధికారులు చెప్తున్నారు. బోనస్ నిధులను మాత్రం ఆర్థికశాఖ విడుదల చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కానీ ఖజానాలో నిధుల కొరత వల్ల జాప్యం జరుగుతున్నదని చేతులెత్తేస్తున్నారు.
వడ్ల కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 2020-21లో బీఆర్ఎస్ సర్కారు రికార్డు స్థాయిలో 92.39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలో ఆ ప్రస్తావనే లేదు. 2021-22 యాసంగిలో 50.90 లక్షల టన్నులు, 2022-23లో 59.77 లక్షల టన్నులు, 2023-24లో 47.19 లక్షల టన్నులు కొనుగోలు చేయగా ప్రస్తుతం తమ ప్రభుత్వం 72.42 లక్షల టన్నులు కొనుగోలు చేసిందని, ఇప్పటివరకు ఇదే ఘనమైన రికార్డు అని పేర్కొన్నారు. కానీ 2020-21 సంగతి చెప్పలేదు. మంత్రి తీరు హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పాత లెక్కలు దాచి ఇదే రికార్డు అంటూ డబ్బా కొట్టుకోవడమేంటని రైతుసంఘాల నేతలు ఎద్దేవా చేశారు.