చెన్నారావుపేట/తానూర్/మాగనూరు, జూలై 10 : యూరియా కోసం రైతులు అవస్థ పడుతున్నారు. నిత్యం పీఏసీఎస్‌ల వద్ద పొద్దంతా క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొన్నది. అయినప్పటికీ వచ్చిన వారందరికీ యూరియా బస్తాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తున్నది. నిత్యం ఎక్కడ చూసినా చెప్పుల క్యూ, రైతుల బారులే కన్పిస్తున్నాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని సహకార సంఘంలో యూరియా కోసం రైతులు లైన్లో నిలబడే ఓపిక లేక చెప్పులు, వాటర్ బాటిళు,్ల రాళు,్ల చెట్టు కొమ్మలను ఉంచారు.
వారం రోజులుగా యూరియా కోసం తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇచ్చే రెండు బస్తాల కోసం కుటుంబ సభ్యులమంతా రోజంతా లైన్లో నిలబడాల్సి వస్తున్నదని వాపోయారు. చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని ఓ ఫర్టిలైజర్ యజమాని యూరియాతోపాటు గుళికలు కూడా కొనాలని, లేదంటే యూరియా అమ్మేదిలేదంటున్నారని ఎల్లాయగూడెం మాధవనగర్ కాలనీకి చెందిన గాదె వెంకటేశ్వర్లు ఆవేదన చెందాడు. అంతేగాక పట్టాదారు పాస్‌బుక్ ఉన్న రైతులకు మాత్రమే రెండు బస్తాల యూరియా ఇస్తున్నారని, అసైన్డ్ భూములు, కౌలు రైతులకు ఇవ్వ డం లేదని పలువురు మండిపడుతున్నారు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం హంగిర్గ పీఏసీఎస్ వద్ద ఉదయాన్నే రైతులు బారులుదీరారు. దాదాపు 16 గ్రామాలకు చెందిన 250 మంది తరలివచ్చారు. ఒక్కొక్కరికి మూడు, నాలుగు బ్యాగులు అందజేశారు. దాదాపు 900లకుపైగా బస్తాలు అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విరివిగా లభించిన యూరియా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరిపడా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ గోడౌన్ల వద్దకు మాగనూరు, కృష్ణ మండలాల రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. యూరియా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనకు గురయ్యారు. ఆధార్ కార్డులతో వచ్చిన రైతులు క్యూలో నిలబడే ఓపిక లేక జిరాక్స్ ప్రతులను వరుసలో పెట్టి సమీపంలోని యార్డు, షెడ్లు, చెట్ల కింద, రోడ్ల వెంట నిరీక్షించారు.