కొడకండ్ల, జనవరి 12 : అప్పులు తెచ్చి సాగు మొదలు పెట్టిన ఓ రైతుకు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రోమోర్ సెంటర్లో కొన్న వరి విత్తనాలు మొలకెత్తకపోవడం, మూడుసార్లు విత్తినా ఫలితం లేకపోవడంతో రూ.లక్షకుపైగా నష్టం వాటిల్లింది. జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగాపురానికి చెందిన చంద్రకాంతం, లలిత దంపతులు తమకున్న 2 ఎకరాలకు తోడు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకొని 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. చంద్రకాంతం యాసంగి కోసం సుర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని గ్రోమోర్ సెంటర్లో గత డిసెంబర్ 3న విత్తనాలు కొనుగోలు చేశాడు. విత్తి నెల రోజులు దాటినా పొలంలో ఒక్క మొలక కూడా రాకపోవడంతో రైతు ఆందోళనకు గురయ్యాడు. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి, కౌలు చెల్లించి సాగు చేస్తున్న తనకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. ఈ విషయమై వ్యవసాయాధికారిని సంప్రందించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.