బల్మూరు, ఫిబ్రవరి 28 : తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ సమీపంలో ఉమమాహేశ్వర రిజర్వాయర్ పనులను ప్రారంభించడంపై అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ అధికారులు, అధికార పార్టీ నాయకులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును ధిక్కరించి పనులు ప్రారంభించడం సబబుకాదని అన్నారు. కోర్టు తీర్పును సదరు ఎమ్మెల్యే, అధికారులు గౌరవించాలని సూచించారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతుల సమస్యలు తెలుసుకోకుండా ఎమ్మెల్యేతోపాటు నీటి పారుదలశాఖ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పును ధిక్కరించిన ఎమ్మెల్యే, నీటిపారుదల శాఖ అధికారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ శుక్రవారం వారు బల్మూర్ ఎస్సై రమాదేవికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు సంబంధించి తమకు రశీదు ఇవ్వాలని పోలీస్స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ విషయమై ఎస్సై రమాదేవిని వివరణ కోరగా.. ఈ అంశం తన పరిధిలో లేదని, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని రైతులకు సూచించినట్టు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో అనంతవరం, బల్మూరు, మైలారం, అంబగిరి గ్రామాల రైతులు ఉన్నారు.