అయిజ, ఫిబ్రవరి 15 : కందుల కొనుగోళ్లలో పీఏసీఎస్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని సబ్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. 50 కిలోల కందుల బస్తాకు సిబ్బంది కిలో 300 గ్రాములు తీసుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం 50 కిలోల బస్తాకు కేవలం 600 గ్రాములు సేకరించాల్సి ఉన్నా పీఏసీఎస్ సిబ్బంది 700 గ్రాములు అదనంగా దోపిడీ చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. దీనిపై రైతులు ప్రశ్నిస్తే కొనుగోళ్లను నిలిపివేస్తున్నారని ఆరోపించారు.
అదనంగా తీసుకున్నట్టు రుజువైతే చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్ డీఎం చెప్పారు. రైతుల వద్దకు వచ్చిన సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్‌రెడ్డి నిబంధనల మేరకు అదనంగా తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన అక్కడి నుంచి జారుకున్నారు.
చైర్మన్ సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులు పీఏసీఎస్‌కు చేరుకొని ఆందోళన చేట్టారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన అదనపు కందులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య మద్దతు పలికారు.