తాంసి, జూన్ 18 : కరెంట్ కోతలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలు, రైతులు విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్తు కోతలు విధిస్తుండటంతో ఆగ్రహానికి గురైన జనం మంగళవారం తలమడుగు మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అధికారులు ఎవరూ లేకపోవడంతో అరగంటకుపైగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా మండల కేంద్రంలో పగలు రాత్రి తేడా లేకుండా గంటల తరబడి విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నదని అన్నారు.
చిన్నపాటి గాలి, దుమారం వస్తే కూడా కరెంటు ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కరెంటు కోతలకు సంబంధించి పలుమార్లు విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. వేసవిలో ఎన్నో అవస్థలు పడ్డామని, వానకాలంలోనూ పరిస్థితిలో మార్పు లేదని వాపోయారు.
భీంపూర్ మండలం నుంచి విద్యుత్తు సరఫరా కారణంగా సమస్యలు వస్తున్నాయని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. కరెంటు సరఫరా మెరుగు పడకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విషయం తెలుసుకున్న ఏఈ సతీశ్ ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.