పుల్కల్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తున్నా పంట రుణమాఫీ చేయలేదని రైతులు, ప్రజలు మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి పుల్కల్ మండల కేంద్రానికి వచ్చిన ప్రచార రథం కళాబృందాన్ని రైతులు అడ్డుకొని వెళ్లగొట్టారు. ఈ ఘటన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో చోటుచేసుకున్నది. ఆరు గ్యారంటీల అమలుపై ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు సర్కార్ అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే కళాబృందం పుల్కల్ చేరుకున్నది.
మార్కెట్ సమీపంలో కళాకారులు పాటలు పాడుతూ ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరిస్తుండగా.. రైతులు, ప్రజలు అడ్డుకున్నారు. రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి మాఫీ చేసిందో చెప్పాలని నిలదీశారు. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. ‘మీరు ఒద్దు, మీ పథకాలు వద్దు’ అని ముక్తకంఠంతో తెలిపారు. ఏం ఒరగబెట్టారని ప్రభుత్వం ఉత్సవాలు జరుపుతుందో తెలుపాలని కళాకారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ గ్రామానికి ఎందుకు వచ్చారని ప్రచార రథాన్ని అడ్డుకుని వారిని గ్రామం నుంచి వెళ్లగొట్టారు. మంత్రి ఇలాకాలో ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందా? అని అక్కడున్న వారంతా గుసగుసలాడుకోవడం కొసమెరుపు.