గంగాధర, నవంబర్ 5: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు కన్నెర్రజేస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
ధర్నా చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసి గంగాధర పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా.. రైతుల నుంచి బస్తా ధాన్యాన్ని కొనలేదని విమర్శించారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు రూ.500 బోనస్ చెల్లించాలని కోరారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసే వరకు బీఆర్ఎస్ రైతులకు అండగా ఉంటుందని స్పష్టంచేశారు.