Farmers Protest | అచ్చంపేట/కల్వకుర్తి, ఫిబ్రవరి 11: ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి..’ అన్నట్టుగా తయారైంది అన్నదాతల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముదామని మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మక్కై అడ్డికిపావు శేరు అడుగుతున్నారు. పల్లి క్వింటాకు అత్యధికంగా రూ.7,060 ధర నిర్ణయించిన వ్యాపారులు.. ఒకటి రెండు క్వింటాళ్లు మాత్రమే గరిష్ఠ ధరకు కొనుగోలు చేశారు. తర్వాత రూ.4,800 నుంచి రూ.5,500 మధ్యలో ధర కేటాయించడంపై రైతులు భగ్గుమన్నారు. ట్రేడర్లు కుమ్మకై తక్కువ ధర ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూర్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్ యార్డుల్లో రైతులు ఆందోళనకు దిగారు. ట్రేడర్లు పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
చైర్‌పర్సన్‌ను నిర్బంధించి ఆందోళన
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం 709 మంది రైతులు 32,875 బస్తాల పల్లిని తీసుకొచ్చారు. క్వింటాకు అత్యధికంగా రూ.7,060, కనిష్ఠంగా రూ.4,816, మధ్యస్తంగా రూ.6,510 ధర నిర్ణయించారు. ట్రేడర్లు కుమ్మకై తక్కువ ధర ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డులోని సెక్రటరీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ చాంబర్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. తలుపు అద్దా లు పగులగొట్టారు. చైర్పర్సన్ అరుణను కొం దరు మహిళా రైతులు చుట్టుముట్టి దాడికి పాల్పడ్డారు. ఆమెను అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్బంధించి ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని రీ టెండర్లు వేయిస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడిని ఆర్యవైశ్య సంఘం, కిరాణా వ్యాపారులు ఖండించారు. దాడికి నిరసనగా సోమవారం మార్కెట్‌యార్డులో కొనుగోళ్లు బంద్ చేస్తున్నట్టు వ్యాపారస్థులు తెలిపారు.
కల్వకుర్తిలో రెండుసార్లు రైతన్నల రాస్తారోకో
వ్యాపారులు సిండికేట్‌గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని మండిపడుతూ ఆదివారం రైతులు కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారం 12 వేల బస్తాలకుపైగా వేరుశనగ తరలివచ్చింది. వ్యాపారులు రహస్య టెండర్ విధానం ద్వారా అత్యధికంగా రూ.7,040, మధ్యస్థంగా రూ.6,100, అత్యల్పంగా రూ.4,806 ధర నిర్ణయించారు. ఒకటి రెండు క్వింటాళ్లు మాత్రమే గరిష్ఠ ధరకు కొనుగోలు చేసి.. ఎక్కువ మొత్తంలో రూ.4,800 నుంచి రూ.5,500 మధ్యలో ధర కేటాయించారు. నెల వ్యవధిలో రూ.2 వేల వరకు ధర తగ్గిందని, వ్యాపారులు సిండికేట్‌గా మారి నిలువు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు ర్యాలీగా వెళ్లి మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న హైదరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. మార్కెట్ కార్యదర్శి, వ్యాపారులతో చర్చిస్తామని పోలీసులు రైతులకు నచ్చజెప్పి విరమింపజేశారు. మార్కెట్ యార్డులో వ్యాపారులు ధరపై స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల్లో అనుమానం మొదలై మళ్లీ రోడ్డెక్కారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులకు సీఐ నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించారు.