యాచారం, జూన్ 17: తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్‌నగర్ ఫార్మా బాధిత రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం నానక్‌నగర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును అడ్డుకున్నారు. సదస్సుకు హాజరైన డిప్యూటీ తహసీల్దార్ కీర్తిసాగర్, ఆర్ఐ మురళీకృష్ణను చుట్టుముట్టి తమ సమస్యలను పరిష్కరించాలని పట్టుబట్టారు. ‘గోబ్యాక్.. గోబ్యాక్’ అని నినదించారు. గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించొద్దని వాగ్వాదానికి దిగారు.
అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రెవెన్యూ సదస్సుకు సంబంధించిన ఫ్ల్లెక్సీలను వేదిక నుంచి తొలగించారు. నెలలు గడుస్తున్నా సమస్యను పరిష్కరించలేదని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఏసీపీ కేపీవీ రాజుపైనా మండిపడ్డారు. సమస్యలను పరిష్కరించేవరకు గ్రామంలో ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టొద్దని హెచ్చరించారు.