మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 29 : తనకు తెలియకుండా తన తండ్రి సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్ చాంబర్లో ఆత్మహత్యకు యత్నించిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో చోటుచేసుకుంది. లద్నూర్‌కు చెందిన కాసర్ల రామస్వామికి బాలమల్లు, శ్రీనివాస్, కనకరాజు ముగ్గురు కుమారులు. రామస్వామి తన పేరిట ఉన్న 1.32 ఎకరాల భూమిని బాలమల్లు, శ్రీనివాస్ కుమారులు భానుచందర్, హరీశ్ పేరు మీద పట్టా చేసేందుకు ధరణిలో స్లాట్‌బుక్ చేశారు. పట్టాకోసం శుక్రవారం వీరంతా తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రామస్వామి చిన్నకుమారుడు కాసర్ల కనకరాజు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నాడు. తనకు తెలియకుండా తన తండ్రి తన సోదరుల పిల్లల పేరిట అక్రమంగా పట్టా చేసేందుకు యత్నిస్తున్నారని, దీనిని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ చాంబర్లోకి పురుగుల మందు డబ్బాతో ప్రవేశించి, తహసీల్దార్ రహీం ఎదుటే ఆత్మహత్యకు యత్నించగా పలువురు అడ్డుకొని వారించారు. రామస్వామిని తహసీల్దార్ తన చాంబర్లోకి పిలిపించుకొని మాట్లాడారు. ముగ్గురు కుమారులకు సమానంగా భూమిని పట్టాచేస్తానని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది.
కృష్ణకాలనీ, నవంబర్ 29 : విద్యుత్తు తీగలు తగిలి షాక్‌కు గురైన ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని నేరేడుపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. నేరేడుపల్లికి చెందిన రైతు మేకల రవి (38) పక పొలం రైతులు వెంబడి సమ్మయ్య, వెంబడి శ్రీను అడవి పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు చుట్టూ విద్యుత్తు తీగలు అమర్చారు. శుక్రవారం ఉదయం రవి పొలం వద్దకు వెళ్లి పంటను పరిశీలిస్తూ, అనుకోకుండా విద్యుత్తు తీగలకు తాకడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ తెలిపారు.