హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ కాకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైద్‌పూర్‌కు చెందిన రైతు జాదవ్ దేవ్‌రావ్ ఆత్మహత్య ఎంతో బాధించిందని తెలిపారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి మాట తప్పడం, రైతు భరోసా ఎత్తివేయడంతోనే దేవ్‌రావు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి బలన్మరణానికి పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ సర్కారీ హత్యేనని మండిపడ్డారు. రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ పేరిట మోసం ఒకవైపు.. రైతు వ్యతిరేక విధానాలు మరోవైపు వారిని బలవన్మరణాల వైపు పురిగొల్పుతున్నాయని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్నదాత అవస్థల పాలవుతున్నా, ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. అప్పులు తీరక అన్నదాతలు మనోవేదనకు గురవుతున్నారని, ఈ ఆత్మహత్యలన్నీ సర్కారీ హత్యేలనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఏలుబడిలో రాష్ట్రం అంధకారం
రుణమాఫీ కాక దికుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది రైతుల అప్పులను వెంటనే మాఫీ చేసి, ప్రభుత్వం వారిని రుణవిముక్తులను చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేవ్‌రావు కుటుంబానికి పట్టిన దీనస్థితి మరే కుటుంబానికి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సూచించారు. పదేండ్లపాటు తెలంగాణలో గుండెలపై చేయి వేసుకొని హాయిగా బతికిన రైతుల జీవితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తిగా అంధకారం అలుముకుందని, గతంలో సాగు, పంట దిగుబడిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉండటం కాంగ్రెస్ సరారు చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు
అన్నదాతలారా! దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నమ్మించి మోసం చేసిన ఈ నయవంచక కాంగ్రెస్ సరారును నిలదీద్దాం, హామీలు అమలయ్యే దాకా కొట్లాడి ముఖ్యమంత్రి మెడలు వంచుదాం తప్ప ఆత్మహత్యలు సమస్యకు పరిషారం కాదని స్పష్టం చేశారు.