మహబూబాబాద్ : కాంగ్రెస్(Congress) అసమర్ధ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు సాగును పండుగలా చేసిన రైతులు కాంగ్రెస్ ఏలుబడిలో ఒక్క యూరియా( Urea) బస్తా కోసం రక్తం చిందించాల్సిన దుస్థితి నేడు రాష్ట్రంలో నెలకొంది. సాగు నీళ్లు ఇవ్వరు, కరెంట్ సరఫరా చేయరు, కనీసం ఎరువులు, పురుగు మందులు కూడా అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైం దని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యూరియా బస్తాల కోసం రైతులు యుద్ధం చేయాల్సిన దారుణ పరిస్థితులు నేడు రాష్ట్రంలో నెలకొన్నాయి. తాజాగా మహబూబాబాద్(Mahabubabad) జిల్లా మరిపెడ మండలం మల్లమ్మ కుంట తండాకు చెందిన అజ్మీరా లక్క, విజయ అనే దంపతులకు 20 రోజులైనా యూరియా దొరకడం లేదని ఇవాళ ఇస్తున్నారని తెలిసి భార్య భర్తలు వచ్చి క్యూలైన్లో నిలబడ్డారు. అయితే లక్కకు గతంలో పక్షపాతం వచ్చి ఇబ్బంది పడుతున్నాడు.
అదే బాధలో యూరియా కోసం గురువారం రాగా లైన్లో నిలబడి ఒక్కసారిగా సొమ్మసిల్లి మెట్ల పైనుంచి కింద పడడంతో తల పగిలి తీవ్ర గాయమైంది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది లక్కను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల కష్టాలను చూసి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.