నెన్నెల, జూన్ 10 : మామిడి పంట అమ్మి నెల రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో పురుగు మందుడబ్బాతో హల్చల్ చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగింది. చిత్తాపూర్ గ్రామానికి చెందిన రామడుగు జనార్దన్ నెల క్రితం 6 టన్నుల మామిడి కాయలను రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో విక్రయించాడు.
ఐకేపీ వారు హర్యానాకు చెందిన విగ్రో సంస్థతో కలిసి కొనుగోళ్లు చేపడుతుండగా, ఏ-గ్రేడ్ మామిడి కిలోకు రూ.35, బీ-గ్రేడ్‌కు రూ.30 చొప్పున ధర నిర్ణయించారు. పంట అమ్మి నెల కావస్తున్నా డబ్బులు ఇవ్వకుండా దాట వేస్తూ వస్తున్నారని మండిపడుతూ మరో రైతు శ్రీనివాస్‌తో కలిసి సోమవారం ఐకేపీ కార్యాలయానికి వచ్చాడు. రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జనార్దన్ పురుగు మందు డబ్బాతో కార్యాలయం ఎదుట దాదాపు మూడు గంటలపాటు బైఠాయించినా అధికారులెవ్వరూ రాలేదు. దీంతో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణికి పురుగు మందు డబ్బాతో వెళ్లి తమకు న్యాయం చేస్తారా? లేదా మందు తాగమంటారా? అనడంతో ఎంపీడీవో దేవేందర్ కలుగజేసుకొని ఫిర్యాదు తీసుకున్నారు. ఆపై ఎంపీడీవో జిల్లా ఐకేపీ డీపీఎం సంజీవ్‌కు పలుమార్లు ఫోన్ చేయగా స్పందించలేదు. ఏపీఎంకు ఫోన్ కలిపి రైతు జనార్దన్‌తో మాట్లాడించారు. చివరకు కిలోకు రూ.35 చొప్పున ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోవడంతో రైతు జనార్దన్ శాంతించారు.