ధర్మపురి, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నృసింహ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కొప్పుల మాట్లాడుతూ.. ఉద్యమనేత కేసీఆర్ పోరాట ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని చెప్పారు.
వచ్చిన తెలంగాణ కేసీఆర్ పదేండ్ల పాలనలో అద్భుత ప్రగతిని సాధించిందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపణలు చేయడం సరికాదని, పైసా అప్పు తేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమో దమ్ముంటే నిరూపించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎమ్మెస్ చైర్మన్ డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.