Rythu Runa Mafi | కొల్లాపూర్, ఆగస్టు 18: నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం చింతలపల్లి గ్రామంలో రైతు రుణమాఫీకి రాజకీయగండం ఎదురైంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు అత్యంత సన్నితంగా ఉండే కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ జాబితా తయారీలో జోక్యం చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన ముఖ్యనాయకులకు అర్హత ఉన్నా జాబితాలో పేరు రాలేదు. అధికారులను అడిగితే విస్మయానికి గురిచేసే సమాధానాలు రావడంతో రాజకీయరంగు పులుముకున్నదనే ఆరోపణలున్నాయి. చింతలపల్లిలో ప్రభుత్వం కాలపరిమితి ప్రకారం 1,800 మంది రైతులు రుణమాఫీకి అర్హత ఉన్నారు. మొదటి విడతలో 154, రెండో విడతలో 193, మూడో విడతలో 100 మందిలోపే లబ్ధిదారులు ఉన్నట్టు తెలుస్తున్నది. మూడు విడుతలు కలిపి 500 మందిలోపే మాఫీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొర్రీలతో కొందరికి కోత పడితే.. స్థానికంగా ఉన్న అధికారపార్టీ నాయకుల జోక్యంతో మరికొందరికి మాఫీ కాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కొల్లాపూర్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ.60 వేలు పంట రుణం తీసుకున్నాను. రేషన్కార్డులేదన్న నెపంతో కుటుంబ నిర్ధారణ చేయాలని చెప్పి నాకు రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో రోజూ బ్యాంకు, వ్యవసాయాధికారులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొల్లాపూర్ బ్రాంచ్లో రూ.లక్ష రుణం తీసుకున్నాను. కాంగ్రెస్ వస్తే రుణమాఫీ చేస్తుందని ఆశపడ్డాను. కానీ నాకు మాఫీ కాలేదు. మాఫీ కోసం రోజు బ్యాంకు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
ప్రభుత్వం ప్రకటించిన కాలపరిమితిలోనే నేను కొల్లాపూర్ సొసైటీ లో రూ.లక్షా 20 వేలు పంట రుణం తీసుకున్నాను. నాకు రేషన్ కార్డు, పాసుపుస్తకం, ఆదాయ ధ్రువీకరణ పత్రం అన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకుల జోక్యంతోనే కొత్త కారణాలను సృష్టించి రుణమాఫీలో పేరు లేకుండా చేశారు. అధికారులను అడిగితే నీకు అర్హత ఉంది కానీ ఎందుకు మాఫీ కాలేదో అర్థం కావడం లేదని సమాధానం చెబుతున్నారు. రుణమాఫీని రాజకీయాలకు వాడుకుంటున్నారు.