కరీంనగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ఎల్లారెడ్డిపేట: హస్తం పార్టీ ఏలుబడిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటవిక రాజ్యం నడుస్తున్నది. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, నిర్బంధకాండ కొనసాగుతున్నది. అధికార యంత్రాంగం దీనికి వత్తాసు పలుకుతున్నది. యూరియా లేదని ప్రశ్నించినందుకు రుద్రంగి మండలం రైతులతో అధికార పార్టీ నాయకులు సారీ చెప్పించి వీడియో విడుదల చేశారు. యూరియా కోసం ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అండగా నిలిచినందుకు 8మంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. యూరియా లేక పంట పాడవుతున్నదన్న ఆవేదనతో మాట్లాడిన ఎల్లారెడ్డిపేట రైతు మానుక లక్ష్మణ్‌పై కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడమే కాకుండా సారీ చెప్పాలని బెదిరించారు. అందుకు అతడు ససేమిరా అనడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న తోటి రైతులు లక్ష్మణ్‌కు అండగా నిలిచారు. రైతును ఆరు గంటలపాటు ఠాణాలోనే ఉంచడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
కడుపు మంటతో మాట్లాడినందుకు..
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రైతు లక్ష్మణ్ ఐదెకరాల్లో వరి సాగు చేశాడు. తన పొలానికి 10 బస్తాల యూరియా చల్లాల్సి ఉంది. చాలా రోజులు తిరిగితే రెండు బస్తాల యూరియా అందింది. సాగు కోసం ఇప్పటికే రూ.1.25 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సకాలంలో యూరియా అందక వరి ఎర్రబారింది. గురువారం యూరియా వస్తున్న విషయం తెలిసి గోదాం వద్దకు వెళ్లాడు. బస్తాలు తక్కువ రావడం, రైతులు వందల సంఖ్యలో ఉండటంతో సరిపడా దొరకదని ఆందోళన చెందాడు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై మండిపడ్డాడు. పంట కండ్ల ముందే ఎర్రబారుతుండటంతో ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఈ సర్కారుకు ఓటేసినందుకు ‘మాకు మేమే చెప్పుతో కొట్టుకోవాలి’ అని ఆక్రోశం వెళ్లగక్కాడు.
ప్రశ్నించినందుకు కేసు
లక్ష్మణ్ తన ఆవేదనను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్ష్మణ్ వ్యాఖ్యలను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించవచ్చు. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టి రైతులు వెతలు తీర్చి ఉండేవారు. కానీ, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చెన్నిబాబు ఆధ్వర్యంలో పలువురు నాయకులు లక్ష్మణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లక్ష్మణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఫిర్యాదు చేయడమే ఆలస్యమన్నట్టు వివిధ సెక్షన్ల కింద రైతు లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అక్కడితో ఆగలేదు, లక్ష్మణ్‌కు ఫోన్ చేసి సారీ చెప్తూ వీడియో విడుదల చేయాలని బెదిరింపులకు దిగారు. అందుకు ఆయన నిరాకరించడంతో మరింత కక్ష పెంచుకున్నారు. అంతేకాదు, లక్ష్మణ్‌ను బీఆర్ఎస్ కార్యకర్తగా ముద్ర వేసేందుకు కూడా ప్రయత్నించారు.
ఇంటికెళ్లిన పోలీసులు.. మద్దతుగా అన్నదాతలు
లక్ష్మణ్‌పై గురువారం రాత్రి కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికెళ్లారు. పోలీసుల రాకను గమించిన తోటి రైతులు ఒక్కొక్కరికిగా అక్కడికి చేరుకున్నారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి లక్ష్మణ్ మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గమనించిన పోలీసులు ఠాణాకు వచ్చి నోటీస్ తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. నోటీసు కోసం లక్ష్మణ్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరగా.. మద్దతుగా రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో కొన్ని ఫార్మాలిటీలు పూర్తిచేసి పంపిస్తామని చెప్పడంతో రైతులు వెనుదిరిగారు. మధ్యాహ్నం 12:45 గంటలకు స్టేషన్‌కు వెళ్లిన లక్ష్మణ్‌ను సాయంత్రం ఆరు తర్వాత విడిచిపెట్టారు. సోమవారం మరోమారు స్టేషన్‌కు రావాలని చెప్పి నోటీస్ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు అతడిని పలు ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. సీఎంను తిట్టాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఎరైనా పోత్సహించారా? అని ప్రశ్నించారు. తనను ఎవరూ ప్రోత్సహించలేదని, యూరియా దొరకలేదన్న బాధతోనే మాట్లాడానని, తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వివరణ ఇచ్చినట్టు తెలిసింది.
సారీ చెప్పాలని వేధించిన్రు
నేను ఐదెకరాల్లో నాటు వేసిన. ఇప్పటి వరకు రెండు యూరియా బస్తాలే ఇచ్చిన్రు. ఆ యూరియాను ఏం చేసుకోవాలన్న బాధతోనే అలా మాట్లాడా. మళ్లీ లోడ్ వచ్చిందని వెళ్లా. 225 బస్తాలు వస్తే 400 మంది రైతులున్నారు. అందుకనే అలా మాట్లాడిన. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు యూరియా దొరకడం లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మా చెప్పుతో మేమే కొట్టువాలని మాట్లాడిన. ఇన్ని రోజులు దేశం పోయి వచ్చి ఎవుసం చేసుకుని బతుకుతున్న. కాంగ్రెస్ పార్టీవాళ్లు నన్నుమర్డర్ కేసులో ఇరికించి జైలుకు పంపాలని కక్షగట్టి ఇరికించారు. రాత్రి 9 గంటలకు కేసు పెట్టిన్రు. ఫోన్ చేసి సారీ చెప్పాలని సతాయించిన్రు. నేనేం తప్పు జేయలేదు కాబట్టి సారీ చెప్ప. నాపై బీఆర్ఎస్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
-మానుక లక్ష్మణ్, బాధిత రైతు
బాధ చెప్పుకుంటే కేసు పెడతారా?
లక్ష్మణ్ తన పొలం ఎండిపోతున్నదని బాధపడి మాట్లడితే బీఆర్ఎస్ కార్యకర్త అని అం టున్నారు. కేసు పెట్టారు. నాకు 4 ఎకరాలున్నది. యూరియా సరిపోలేదని బాధ ఉన్నది. నేను గూడ నాటేసి రెండు నెల్లయింది.
-రాగుల బాల్‌రెడ్డి, రైతు (ఎల్లారెడ్డిపేట)
రైతుల కోసం మాట్లాడితే కేసా?
రైతులకు యూరియా సరిపోదన్న బాధతోటి లక్ష్మణ్ మాట్లాడిండు. దానికి ఆయన మీద కేసు పెడ్తె ఎలా? మాకు నిన్న వచ్చిన బండి ఇవ్వారకు ఇయ్యలేదు. గవర్నమెంటుకు ఓటేసిందుకు నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టు అయిందని లక్ష్మణ్ అన్నడు.
-సిలివేరి శ్రీనివాస్, రైతు (ఎల్లారెడ్డిపేట)