గుమ్మడిదల, మార్చి 2: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సమావేశమైన జేఏసీ నాయకులు మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణ చేయాలని నిర్ణయించారు. దీనికోసం 13 గ్రామ పంచాయతీల పరిధిలోని నాయకులకు తీర్మాన ప్రతులను అందజేశారు.
ఈ సందర్భంగా రైతు జేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడంపై పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో చేపట్టి రిలే దీక్షలు ఆదివారం నాటికి 20వ రోజుకు, నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 26వ రోజుకు చేరుకున్నాయి.