నవాబ్‌పేట, జనవరి 27 : భారీ పేలుడు శబ్దానికి గిరిజన రైతు గుండె ఆగింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కారుకొండ గ్రామపంచాయతీ శామగడ్డతండాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు, తండావాసుల కథనం మేరకు.. శ్యామగడ్డతండా శివారులోని ఉదండాపూర్ రిజర్వాయర్‌లో కొంతకాలంగా కాంట్రాక్టర్ పెద్ద పెద్ద రాళ్లను తొలగించే క్రమంలో బ్లాస్టింగ్ పెట్టించాడు. సోమవారం బ్లాస్టింగ్ శబ్దానికి రాములునాయక్ (62)కు గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. రాములు నాయక్ మృతికి రిజర్వాయర్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమంటూ.. తండావాసులు, అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి ధర్నా చేసేందుకు తండావాసులు ప్రయత్నించగా విషయం తెలుసుకున్న మహబూబ్‌నగర్ రూరల్ సీఐ గాంధీనాయక్, నవాబ్‌పేట ఎస్సై విక్రమ్ వారితో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.